Devara Movie : దేవర మూవీ సెట్స్ లో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతుంది. ఏకంగా 20 మంది గాయాలపాలు అయ్యారట. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విషయంలోకి వెళితే… ఎన్టీఆర్ ఏక కాలంలో దేవర, వార్ 2 చిత్రాల షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన ముంబైలో ఉన్నారు. వరుస షెడ్యూల్స్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం దేవర షూటింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మోదకొండమ్మ పాదం అనే ప్రాంతంలో జరుగుతుందట.
అటవీ ప్రాంతం కావడంతో అనూహ్యంగా యూనిట్ సభ్యుల మీద తేనెటీగల దాడి జరిగిందట. దాదాపు 20 మందికి గాయాలు అయినట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కి కూడా గాయాలు అయ్యాయా? లేక ఆయన సురక్షితంగా ఉన్నారా? అనే సమాచారం అందాల్సి ఉంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గాయాలపాలైన యూనిట్ సభ్యులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారట.
పూర్తి సమాచారం అందాల్సి ఉంది. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. సాగర తీరం నేపథ్యంలో మూవీ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది.
ఇక ప్రధాన విలన్ రోల్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పెద్ద ఎన్టీఆర్ రోల్ చాలా పవర్ఫుల్ గా కొరటాల శివ డిజైన్ చేశారట. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి.