Spanish Woman: మామూలుగా మనకు జ్వరం వస్తేనే ఇబ్బంది పడతాం. జలుబు చేస్తే నరకం చూస్తాం.. అలాంటిది క్యాన్సర్ వస్తే… భయంతో వణికి పోతాం.. అదే చివరి దశలో గుర్తిస్తే జీవితంపై ఆశలు కొట్టేసుకుంటాం.. అలాంటిది 36 ఏళ్ల వయసు ఉన్న ఓ మహిళలు శరీరంలో ఏడు కణితులు ఉన్నాయి.. ఐదు రకాల క్యాన్సర్లు సోకాయి. అసలు కనివిని ఎరుగని మార్పులతో ఆమె శరీరం వైద్యులనే సవాల్ చేస్తోంది.

ఇంతకీ ఏమైందంటే
యూరప్ లోని స్పెయిన్ కు చెందిన ఒక మహిళ శరీర నిర్మాణం వైద్యశాస్త్రాన్ని నివ్వర పరుస్తోంది.. జీవితమంతా ఆమెపై క్యాన్సర్ కణితులు దాడి చేస్తూనే ఉన్నాయి. ఆమెకు 36 ఏళ్ళు వచ్చేసరికి 12 రకాల ట్యూమర్లను ఎదుర్కొన్నది.. అయితే ఆమె జన్యులను తరచి చూసిన పరిశోధకులకు మానవుల్లో ఎన్నడూ చూడని మార్పులు కనిపించాయి.. అయితే ఇప్పటికీ ఆమె ఎలా జీవించి ఉందన్నది వారికి అంతు పట్టడం లేదు.. సదరు మహిళ రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తొలిసారి క్యాన్సర్ బారిన పడింది. 15 సంవత్సరాలు వచ్చేసరికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడింది. మరో ఐదు సంవత్సరాలకు లాలాజల గ్రంధిలో ట్యూమర్ ఏర్పడింది. వైద్యులు ఆ అవయవాన్ని తొలగించారు.. 21 ఏళ్ల వయసు వచ్చేవరకు వైద్యులు మరో శస్త్రచికిత్స నిర్వహించి లో గ్రేడ్ సార్కోమాను తొలగించారు.. తర్వాత కూడా చిన్నచిన్న ట్యూమర్లను ఆమె ఎదుర్కొన్నది.. మొత్తం మీద 12 రకాల ట్యూమర్లు శరీరం మీద విరుచుకుపడ్డాయి.. వాటిల్లో 5 క్యాన్సర్ ట్యూమర్లు ఉన్నాయి.
ఎందుకు ఏర్పడ్డాయి అంటే
ఇన్ని రకాల ట్యూమర్లు ఉన్న ఆమె శరీరంపై స్పెయిన్ కు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి చెందిన పరిశోధకుల బృందం ప్రయోగాలు చేసింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి ఈ ట్యూమర్లు ఎందుకు ఏర్పడుతున్నాయో మూలాలను గుర్తించారు.. బాధితురాలి రక్త నమూనాలు సేకరించి పరిశీలించారు. ఆమె కణాల్లోని ఎఏడీ1ఎల్1 అనే జన్యువులోని రెండు ప్రతుల్లో ఉత్పరివర్తనం కనిపించడం శాస్త్రవేత్తలను నివ్వెరపరిచింది. మన శరీరం లో ఒక కణం విభజనకు ముందు అందులోని క్రోమోజములను క్రమ పద్దతిలో ఉంచేందుకు ఎఏడీ1ఎల్1 జన్యువు సహాయపడుతుంది.

ఇవి కొత్త కాదు
ఎఏడీ1ఎల్1 జన్యువులో ఉత్పరివర్తనాలు కొత్తేమీ కాదు.. అయితే ఈ జన్యువుకు సంబంధించిన రెండు ప్రతుల్లో ఒకదానిలోనే ఆ మార్పులు కనిపిస్తూ ఉంటాయి.. కానీ స్పెయిన్ మహిళలో మాత్రం రెండు ప్రతుల్లోనూ వైరుధ్యం కనిపించింది.. మానవుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే మొదటిసారి. దీనివల్ల ఆ మహిళలో క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఇక మానవ కణాల్లోని న్యూక్లియస్ లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి.. అందులో ఒక జత తండ్రి నుంచి, ఇంకో జత తల్లి నుంచి వస్తాయి. జంట ఉత్పరివర్తనాల వల్ల స్పెయిన్ మహిళ కణ ప్రతుల తయారీ ప్రక్రియ దెబ్బతింటున్నది. ఫలితంగా భిన్న సంఖ్యల్లో క్రోమోజోములు కలిగిన కణాలు ఉత్పత్తి అవుతున్నాయి.. ఆమె రక్తంలోని 30 నుంచి 40% కణాల్లో అసాధరణ సంఖ్యలో క్రోమోజోములు ఉన్నాయి.