
టాలీవుడ్ సర్దుకుంటోంది. సెకండ్ వేవ్ తో వచ్చిన కరోనా కల్లోలంలో భవిష్యత్ కార్యాచరణను రెడీ చేసుకుంటోంది. మొదటి వేవ్ తో నిండా మునిగిన సినీ ఇండస్ట్రీ సెకండ్ వేవ్ తో మరింత కష్టాల్లోకి నెట్టబడింది. అందుకే ఇక థర్డ్ వేవ్ తో ఆ ఉపద్రవం రాకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోంది.
కరోనా దెబ్బకు షూటింగ్ లు నిలిచిపోయి.. థియేటర్లు మూతపడి సినీ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతింది. సెకండ్ వేవ్ తో మరోసారి షూటింగ్ లు ఆగిపోయాయి. పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయన్నది క్లారిటీ లేదు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా విడుదల తేదీని వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఆగస్టు వరకు కూడా సినీ ఇండస్ట్రీ కోలుకునే అవకాశాలు లేవు. అప్పటికీ పరిస్థితి ఇలా ఉంటే థియేటర్లు తెరుస్తారో లేదో తెలియదు.
అందుకే ఇప్పుడు చిన్న సినిమాల నిర్మాతలు సినిమాల విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో తమ షూటింగ్ లన్నీ పూర్తి చేసి ఆగస్టులో విడుదలకు రెడీ చేస్తున్నారు.
ఇక కరోనా వేవ్ లకు తట్టుకునేలా సినీ ఇండస్ట్రీ రెడీ అవుతోంది. షూటింగ్ లకు హాజరయ్యే లైట్ మెన్ నుంచి.. దర్శకుడి వరకు అందరికీ ప్రైవేటు జోరుగా టీకాలు వేస్తున్నారు. షూటింగ్ లు వచ్చే నెలలో మొదలు పెట్టేసరికి వీరంతా రెడీగా ఉంటారని.. కరోనా వచ్చినా ఏం కాకుండా నిర్మాతలు అంతా సర్దుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఉచితంగా తమ షూటింగ్ సిబ్బందికి నిర్మాతలు ఈ టీకాలు వేయిస్తున్నారట.. దీని వల్ల ఇక నిరాటంకంగా షూటింగ్ లు చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు.