Prakash Raj: ‘మా’ ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందా ? మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ప్రకాష్ రాజ్ ‘పోలింగ్ రోజు రౌడీయిజం జరిగిందని ఆరోపించారు. ప్రకాష్ రాజ్ మాటల్లోనే ‘మా ఎన్నికల్లో చాలా దారుణాలు జరిగాయి. ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అన్నిటికీ మించి సీనియర్ నటుడు బెనర్జీని బూతులు తిట్టారు. ఆయన పై చేయి చేసుకున్నారు. ఈ సంఘటనలన్నీ మమ్మల్ని చాలా బాధ పెట్టాయి.

అందుకే ఈ రెండు రోజులుగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అన్నీ చర్చించుకుని మా ప్యానల్ లో గెలిచిన వారందరం ఓ నిర్ణయానికి వచ్చాం. మేము అంతా రాజీనామా చేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దు. ‘మా’ ఎన్నికలలో గెలిచిన విష్ణుకి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
విష్ణుగారు వారికి నచ్చిన వారిని తీసుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం’ అని ప్రకాష్ రాజ్ మాట్లాడారు. అలాగే ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. మా ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల్లో కొందరు ఎన్నికల్లో మొదటి రోజు గెలిచారు. గెలిచారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే గెలిచినా మా సభ్యులు, రెండో రోజు ఎలా ఓడిపోతారు ?
రాత్రికి రాత్రే ఫలితాలు పూర్తిగా ఎలా మారిపోయాయి..? మెయిన్ గా మోహన్ బాబు గారు ఎన్నికల సమయంలో అక్కడే కూర్చున్నారు. మీరు చూశారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకువచ్చి ఓట్లు వేయించారు. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్ నటుడి పై చేయి చేసుకోవడం దారుణం. అందుకే మా ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం’ అని ప్రకాష్ రాజ్ తెలియజేశారు.