కొన్ని డైలాగులు తెరమీదే బాగుంటాయి నిజ జీవితంలో తారుమారు అవుతుంటాయ్! వాటిని తట్టుకొని నిలబడితేనే రియల్ లైఫ్ అయినా రీల్ లైఫ్ అయినా చివరకు అది పొలిటికల్ లైఫైనా సరే! ఆమాట కొస్తే! మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది అన్న డైలాగ్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి సరిగ్గా సూటవుతుందనుకున్నాడు సగటు ప్రేక్షకుడు, ఈ డైలాగ్ కి థియేటర్లలో విజిల్ వేయని అభిమాని లేడు క్లాప్స్ కొట్టని ప్రేక్షకుడు లేడు. బట్ చిరంజీవి పొలిటికల్ జర్నీలో ఈ డైలాగ్ ఎందుకనో అంతగా యాప్ట్ కాలేదు. తెరపై చప్పట్లన్నీ ఓట్లుగా మారలేదు.. మెగాస్టార్ కే ఈ డైలాగ్ వర్తించనప్పుడు మామూలోళ్లకు ఎలా? వర్తిస్తుందన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో మరి.

గెలుపోటములు సహజం ఇది అందరికీ తెలిసిన విషయమే! ఇప్పుడసలు ఈ టాపిక్ ఎందుకనేగా మీ డౌట్ ఆగండాగండి అక్కడికే వస్తున్నా! గత రెండు మూడు నెలలుగా గతంలో ఎప్పుడూ లేనంత వాడీవేడిగా మా ఎన్నికల హడావుడి జరిగిన విషయం తెలిసిందే! ‘మా’ అంటూనే మేమంటే మేమంటూ విష్ణు ప్యానెల్ ఒకవైపు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మరోవైపు బహిరంగ విమర్శలే కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ విశ్మయానికి గురిచేసింది. కుల, ప్రాంతీయ బేధాలు సైతం బగ్గుమన్నాయి.. మెగా కాంపౌండ్ సపోర్ట్ మొత్తం నా వైపుందని ప్రకాశ్ రాజ్, మొత్తం ఇండస్ట్రీ నావైపని ఢంకా పదంగా చెప్పిన విష్ణు ఇలా మా ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మధ్య మధ్యలో నాగబాబు తన వీడియోలు ద్వారా మా ఎన్నికల్లో హీట్ పుట్టిస్తే మరోవైపు శివాజీ రాజా కూడా తన వంతు ప్రకాశ్ కి అనుకూలంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం మనం చూశాం.. విష్ణు గెలుపు బాధ్యతను సీనియర్ నరేష్ తన భుజాలపై వేసుకోవడం కూడా చూశాం.
అసలు ఇంతగా ఏముందని ‘మా’ కుర్చీలో అంత మాయ ఉందా? అంతకు మించిన గమ్మత్తైన మత్తు ఇంకేమైనా ఉందా? ఎన్నికలంటే? అంత అత్యుత్సాహం దేనికి? ఇవన్నీ సగటు ప్రేక్షకుడి మదిలో మెదలిన ప్రశ్నలే!
మా పీఠం కేవలం పదవి మాత్రమే కాదు, ఇదొక గురుతరమైన బాధ్యత! వృద్ధ పేద కళాకారుల సంక్షేమంతో పాటు తెలుగు ఇండస్ట్రీ ప్రతిష్టను పెంచే ఓ మహా యజ్ఞం గా మా ఎన్నికలను తీసుకుంటే ఇంత రచ్చ జరిగుండేది కాదేమో? మా లో చీలికలు లేవంటూనే రెండు వర్గాలుగా చీలిపోవడం దేనికి సంకేతమో? అసలు మా స్థాపించడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని కనీసం సీనియర్ నటులైనా చెప్పుండాల్సింది. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నది కొంత మంది అభిప్రాయం. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, ఒకరు గెలవాలంటే? ఇంకొకరికి ఓటమి తప్పదు.. ఈ మాత్రానికే కొంతమంది రాజీనామాలు చేయడం దేనికి సంకేతమో? నిజంగానే ఓటమిని జీర్ణించుకోలేని వాళ్లు ఇలాంటి ఆట ఆడకూడదు, ఆటలో తగిలిన దెబ్బలకు చిన్నపిల్లలే ఆటలో అరటిపండని మరచిపోతుంటే? కళాకారులు మాత్రం జీర్ణించుకోలేక పోవడం హాస్యా స్పదం అంతకుమించి బాధాకరం. ఒక సినిమా హిట్టవుతుంది, మరో సినిమా ఫట్టవుతుంది అంత మాత్రాన నటించడం మానేస్తున్నారా? లేకుంటే? నటననే శాశ్వతంగా వదిలేస్తున్నారా? అని సగటు ప్రేక్షకుడు ప్రశ్నిస్తే ఇండస్ట్రీ ఏం సమాధానం చెప్తుందో! సినిమాలో డైలాగ్ పండినంత మాత్రాన ఆ డైలాగ్ నిజ జీవితంలో నిజం కావాలని లేదుగా?మా ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన కళామ్మతల్లి తల్లి కాకుండా పోతుందా? మా సభ్యత్వానికి రాజీనామా చేసి ‘మా’ అనే మాటకు మీరిచ్చే గౌరవం ఇదేనా? విమర్శలకు నిలబడితేనే అది కేవలం విమర్శలు మాత్రమే అని కాలమే చెప్తుంది! అలా కాకుండా పదవి దక్కలేదని అక్కసు వెళ్లగక్కితే! ఏదో సొంత ప్రయోజనాన్ని ఆశించే జనాలను ఎర్రిపుష్పాలను చేశారని ఇదే సినిమాలోకం కోడై కూస్తుంది.