MLC By Election: తెలంగాణలో ఖాళీ అయిన వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈమేరకు ఎన్నికల సంఘం గురువారం(ఏప్రిల్ 25న) షెడ్యూల్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కొన్ని గంటల్లోనే షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం.
మే 2న నోటిఫికేషన్..
వరంగల్ – ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించే ఉప ఎన్నికల నోటిఫికేషన్ మే 2న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. అదే రోజు నుంచి మే 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొంది. మే 10వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది. మే 13 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుందని తెలిపింది.
ఓటరు జాబితా సిద్ధం..
మరోవైపు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇప్పటికే పట్టభద్రుల ఓటరు నమోదు చేపట్టారు. ఈమేరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఇంటింటికీ తిరిగి విచారణ చేపట్టిన ఓటర్ల తుదిజాబితా రూపొందించారు. జాబితా కూడా విడుదల చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే 43,759 మంది ఓటర్లు తగ్గారు. ఓటరు నమోదుకు పట్టభద్రులు నిరాసక్తి చూపారు. మహిళా ఓటర్లు మాత్రం 1,930 మంది పెరిగారు. పురుష ఓటర్లు 45,627 మంది, ఇతరులు 62 మంది తగ్గారు.