NEET: నీట్ పై ఎందుకీ గందరగోళం? నిజంగానే అవకతవకలు జరిగాయా? పరీక్ష రద్దు సాధ్యమేనా?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఈ పరీక్ష నిర్వహణకు రెండు రోజుల ముందు స్కాం బయటపడిందని జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 12, 2024 12:35 pm

NEET

Follow us on

NEET: ఎంబీబీఎస్, తత్సమాన వైద్య విద్య కోర్సులలో సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన “నీట్ -2024″ పై నీలి నీడలు అలముకున్నాయి. 24 లక్షల మంది ఈ పరీక్ష రాయగా.. వెల్లడైన ఫలితాలు అనేక వివాదాలకు కారణమవుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసు కు సంబంధించి మంగళవారం తీర్పును వెల్లడించింది..” నీట్ పరీక్ష నిర్వహణలో దాని పవిత్రతకు భంగం కలిగింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జాతీయ పరీక్ష మండలి(NTA)పై ఉంది. ప్రశ్న పత్రం లీకేజీ, ఇతర అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సమాధానం ఇవ్వాల్సిందేనని” కేంద్రాన్ని, ఎన్టీఏ ను సుప్రీంకోర్టు ఆదేశించడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ ను నిలుపుదల చేసేందుకు జస్టిస్ విక్రమ్ నాథ్, ఆసానుద్దీన్ తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఇదే సమయంలో పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలను పరిశీలనలోకి తీసుకుని బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రాష్ట్రంలో అక్రమాలు జరిగాయనే విమర్శలు సుప్రీంకోర్టు దాకా వచ్చాయి. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో జూలై 8 నుంచి ఈ కేసు పై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. ఈ లోగానే ఎన్టీఏ సమాధానం చెప్పాల్సి ఉందని స్పష్టం చేసింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఇప్పటికే సుప్రీంకోర్టును శివంగి మిశ్రా, మరో 9 మంది అభ్యర్థులు ఆశ్రయించారు. అయితే వారు దాఖలు చేసిన పిటిషన్ ను ఈ కేసుకు సుప్రీంకోర్టు జత చేసింది.

మే 5న నిర్వహణ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఈ పరీక్ష నిర్వహణకు రెండు రోజుల ముందు స్కాం బయటపడిందని జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. పరశురాం రాయ్ అనే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని తుషార్ భట్ అనే ఓ ఉపాధ్యాయుడు కలిసి గుజరాత్ కు చెందిన 16 మంది విద్యార్థులను నీట్ లో క్రమంగా పాస్ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి వద్ద ఒక్కొక్కరి నుంచి 10 లక్షల దాకా వసూలు చేసినట్టు తెలుస్తోంది. పరీక్ష జరిగిన తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం నడిచింది. లీక్ కు గురైన ప్రశ్నపత్రం ఇదేనని సోషల్ మీడియాలో ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. చివరికి కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకురాలు ప్రియాంకా గాంధీ కూడా ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పరీక్షను సక్రమంగా నిర్వహించకపోవడంతో, లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ క్రమంలోనే నీట్ పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారాన్ని సమీక్షించేందుకు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది.

ముందే ఎందుకు విడుదల చేసినట్టు?

ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14న నీట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కానీ ఎన్టీఐ అకస్మాత్తుగా పార్లమెంట్ ఫలితాలు వెలువడిన జూన్ 4న అంటే 10 రోజుల ముందే విడుదల చేసింది.. యావత్ దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో.. ఎన్టీఐ ఇలా అకస్మాత్తుగా ఫలితాలను వెల్లడించడం ఆశ్చర్యానికి గురి చేసింది. అక్రమాలు జరిగాయి కాబట్టే, ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ఎన్టీఐ ఇలా చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

లోప భూయిష్టం

నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిందన్న ఆరోపణలు పక్కన పెడితే.. వెల్లడించిన ఫలితాలు కూడా పెను వివాదానికి కారణమయ్యాయి. ఏకంగా 67 మంది విద్యార్థులు నూటికి నూరు శాతం మార్కులు (720) సాధించి నెంబర్ వన్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. నీట్ చరిత్రలో ఇంతమంది విద్యార్థులకు ఎన్నడూ నంబర్ వన్ ర్యాంకులు రాలేదు. ఈ 67 మంది విద్యార్థులలో 8 మంది హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందినవారు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక వీరి హాల్ టికెట్ నెంబర్లు కూడా ఒకే సిరీస్ లో దర్శనమిస్తున్నాయి. ఈ 67 మంది టాపర్లకు ఫస్ట్ ర్యాంక్ లు ప్రకటించిన ఎన్టీఏ.. కౌన్సెలింగ్ ర్యాంకులను మాత్రం దశాంశ (డెసిమల్) విధానంలో ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఇవ్వడం ఎలా సాధ్యమో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పడం లేదు.

నీట్ చరిత్రకు భిన్నంగా..

ఆశ్చర్యకరంగా, నీట్ చరిత్రకు భిన్నంగా కొంతమంది విద్యార్థులకు 717, 718, 719 మార్కులు వచ్చాయి. నీట్ స్పాట్ (పరీక్ష మూల్యాంకనం) ప్రకారం ఇలా మార్కులు వచ్చేందుకు అవకాశం లేదు. నీట్ నిబంధనల ప్రకారం ఒక ప్రశ్నకు సరైన జవాబు రాస్తే నాలుగు మార్కులు లభిస్తాయి. తప్పు జవాబుకు ఒక మైనస్ మార్క్ ఉంటుంది. మొత్తం పేపర్లో 180 ప్రశ్నలు ఉంటాయి. ఇన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాస్తే 720 మార్కులు లభిస్తాయి. ఈ పాటర్న్ ప్రకారం 180 ప్రశ్నలకు ఒక విద్యార్థి ఒక ప్రశ్న వదిలేసాడు అనుకుంటే.. రాసిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు మొత్తం సరైనవే అని భావిస్తే.. 716 మార్కులు లభిస్తాయి. ఒకవేళ ఒక ప్రశ్నకు తప్పు సమాధానం రాస్తే ఒక మార్కు తగ్గి 715 మార్కులు లభిస్తాయి. అంతేగాని 719, 718, 717 మార్కులు వచ్చేందుకు అవకాశం లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే నీట్ పరీక్షలో ఎన్నో అవకతవకలు జరిగాయి..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెబుతోందంటే

“విద్యార్థులకు పరీక్ష సమయం వివిధ కారణాల వల్ల వృధా అయ్యింది. అందువల్లే వారికి అదనపు మార్కులు కలిపాం. ఫలితంగా 719, 718, 717 మార్కులు వచ్చాయని” చెబుతోంది. అయితే విద్యార్థులకు సమయం ఎలా వృధా అయ్యింది? ఎందుకు వృధా అయ్యింది? అలా మార్కులు వేయాలని ఎవరు చెప్పారు? దేని ఆధారంగా ఇలా నిర్ణయించారు? గతంలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనే ప్రశ్నలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారుల వద్ద సమాధానాలు లేవు.. అటు తల్లిదండ్రులు, విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమాధానాలపై సంతృప్తి చెందడం లేదు.. మొత్తంగా ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవకతవకలకు తావు లేకుండా పరీక్షను పకడ్బందీగా మరొకసారి నిర్వహించాలని వారు కోరుతున్నారు.