US education crisis: చాలామంది భారతీయులు అమెరికా విద్యా వ్యవస్థను అత్యుత్తమంగా భావిస్తారు. అక్కడ చదివితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, జీతాలు అధికమవుతాయని అనుకుంటారు. కానీ, గ్రౌండ్ రియాలిటీ మాత్రం భిన్నంగా ఉందని నిపుణులు అంటున్నారు. ‘‘దూరపు కొండలు నునుపే’’ అన్న సామెతలాగే, అమెరికా ఉన్నత విద్య కూడా వెలుపలి ఆకర్షణ మాత్రమేనని వారు చెబుతున్నారు.
వివేక్ రామస్వామి కీలక ట్వీట్..
యూఎస్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వివేక్ రామస్వామి ఇటీవల అమెరికా విద్యా స్థాయిపై కీలక ట్వీట్ చేశారు. అమెరికాలో 8వ తరగతి విద్యార్థులలో దాదాపు 75 శాతం మందికి మాథ్స్ ప్రావీణ్యం లేదని, చైనా విద్యార్థులు నాలుగింతల జ్ఞానంతో ముందున్నారని పేర్కొన్నారు. సైన్స్, మాథ్స్ వంటి కీలక రంగాల్లో దృక్పథ మార్పులు లేకుంటే అమెరికా భవిష్యత్తుకు ముప్పు తప్పదని హెచ్చరించారు.
అమెరికా యువతలో ఆధిక్యత లోపం
భౌతిక శాస్త్రం, గణితశాస్త్రం, సైన్స్ ఒలింపియాడ్‌లలో ఉన్నత స్థానాలు సాధిస్తున్న విద్యార్థుల్లో ఎక్కువమంది భారతీయులు, చైనీయులు కావడం యాదృచ్ఛికం కాదు. అమెరికా విద్యార్థుల్లో అకడమిక్ రిగర్ తగ్గిపోవడం, ఆర్థికంగా అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం దీనికి ఒక ప్రధాన కారణం.
భారత విద్యా పటిమపై కొత్త వెలుగు
విద్యా వ్యవస్థలో మౌలిక బలాలతో ఉన్న భారత విద్యార్థులే అమెరికా సంస్థల్లో ప్రధానంగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. విశ్వవిద్యాలయాల కఠినమైన సిలబస్, గణితంపై ఉన్న సంప్రదాయ ప్రాధాన్యం కారణంగా భారతీయులకు సమస్యా పరిష్కార నైపుణ్యాలు మెరుగ్గా ఉంటాయి. అదే క్రమంలో అమెరికాలో చదువుకున్నవారిలో ప్రాక్టికల్ నైపుణ్యాల కొరతను కంపెనీలు గుర్తిస్తున్నాయి.
తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన వాస్తవం
20–30 ఏళ్లుగా అమెరికాలో ఉన్న కుటుంబాలు, తమ పిల్లలను అక్కడే చదివించాలని భావించే వారు ఇప్పుడు కొత్త దృక్పథం అవలంబించాల్సిన సమయం వచ్చింది. విదేశీ డిగ్రీ కన్నా విలువైనది విద్యా నాణ్యత. భారతీయ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా రాణించడానికి కారణం, వారి ప్రాథమిక విద్యలో ఉన్న క్రమశిక్షణ ఇందుకు కారణం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. అమెరికా చదువులుఙనకన్నా గొప్పవేమీ కాదన్న నిజం తెలుసుకోవాలి.
అమెరికా విద్యా రంగం గ్లామర్ వెనుక ఉన్న లోపాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. చైనా, భారత్ వంటి దేశాలు బలమైన విద్యా పునాదులపై భవిష్యత్తు సాంకేతిక ప్రపంచాన్ని ఆక్రమిస్తున్నాయి. అందువల్ల విదేశీ బ్రాండ్ విలువ కన్నా, మన చదువులే నిజమైన బలం అని నిపుణులు చెబుతున్నారు.