Salute to Mother: ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల సమయంలో అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం పథకం తెస్తామని.. ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి రూ.15 వేల చోప్పున ఇస్తామని టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కొత్తరకం మోసాలకు తెలరతీశారు. నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్‌లు, వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్ పంపించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
బ్యాంకు వివరాలు తెలుసుకుని..
’తల్లికి వందనం’ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందించే ఒక సంక్షేమ కార్యక్రమం. ఇటీవలే లబ్ధిదారులకు నగదు సాయం తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఖాతాల్లో డబ్బులను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టిస్తున్నారు. ‘మీ అకౌంట్‌లో డబ్బులు జమ కాలేదా?‘ లేదా ‘మీ అకౌంట్ హోల్డ్‌లో ఉంది‘ వంటి మెస్సేజ్‌లు ఫోన్లకు పంపిస్తున్నారు. వెంటనే కొందరు బ్యాంకు ఖాతా వివరాలు తెలుపుతున్నారు. ఇలా సేకరించిన వివరాలతో ఖాతా ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలను, ముఖ్యంగా సాంకేతిక అవగాహన తక్కువగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఏపీకే ఫైల్స్ పంపుతూ..
సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైళ్ల ద్వారా కూడా మోసం చేస్తున్నారు. వాట్సాప్ లేదా, టెక్స్ మెస్సేజ్‌ల ద్వారా ఏపీకే ఫైల్స్ పంపుతన్నారు. వినియోగదారులు లింక్‌పై క్లిక్ చేయగానే వినియోగదారుల ఫోన్లలో ఉన్న మాల్వేర్ లేదా స్పైవేర్ ఇన్‌స్టార్ అవుతుంది. ఇది వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ నేరగాళ్లకు పంపితుంది. ఈ సమాచారం వినియోగించి ఖాతాల్లోని డబ్బలు దోచేస్తున్నారు.
Also Read: బాపు తీసిన భక్త కన్నప్ప కంటే ఈ ‘కన్నప్ప’ ఎందుకు బెటర్?
జాగ్రత్త అంటున్న పోలీసులు..
తల్లికి వందనం పేరుతో మోసాలు పెరుగుతుండడం, పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ‘ఎవరైనా ఓటీపీ అడిగితే షేర్ చేయవద్దు, నకిలీ లింకులు లేదా ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు‘ అని స్పష్టంగా సూచిస్తున్నారు. ప్రభుత్వ లేదా బ్యాంకు అధికారులు ఎప్పుడూ ఓటీపీ లేదా వ్యక్తిగత బ్యాంకు వివరాలను అడగరని పోలీసులు తెలియజేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్లు లేదా యాప్ స్టోర్‌ల నుంచి∙మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలని, అనుమానాస్పద లింకులను నివారించాలని సలహా ఇస్తున్నారు. అలాగే, సైబర్ నేరాల గురించి ఫిర్యాదు చేయడానికి 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రై మ్ పోర్టల్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
సైబర్ మోసాల నుంచి రక్షణ పొందడానికి ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
‘తల్లికి వందనం’ లాంటి పథకాలకు సంబంధించిన సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఓటీపీ లేదా బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. గుర్తు తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. సైబర్ మోసాల గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి. మోసపోయినట్లు అనుమానం కలిగితే వెంటనే 1930కు కాల్ చేయడం లేదా సైబర్ క్రై మ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.