Talliki Vandanam Scheme: కొత్త విద్యా సంవత్సరం( academic year) ప్రారంభం కానుంది. రేపు ఏపీవ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ 24 న విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. సుమారు 50 రోజుల అనంతరం పాఠశాలలు రేపటి నుంచి తెరుచుకోనున్నాయి. ఇందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి రోజు పాఠ్యపుస్తకాలతో పాటు ప్రత్యేక కిట్లను అందించేందుకు నిర్ణయించింది. మరోవైపు తల్లికి వందనం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. కొద్ది రోజుల్లోనే ఈ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక తుదికసరత్తు కొనసాగుతోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న వివరాలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటాను అనుసంధానం చేసి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ, సచివాలయ సిబ్బంది సమావేశాలు కొనసాగుతున్నాయి. తుది జాబితా ఖరారు తర్వాత అర్హుల వివరాలు, పథకం అమలు తేదీ పై ఒక నిర్ణయానికి రానున్నారు.
* బడ్జెట్లో నిధుల కేటాయింపు..
సూపర్ సిక్స్( super six ) పథకాల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఈ వార్షిక బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. హామీ ఇచ్చిన మాదిరిగానే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని తాజాగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే లబ్ధిదారుల ఎంపికలు మార్గదర్శకాలు కీలకం కానున్నాయి. అయితే ఈ నెల 12 లేదా 14న ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు లబ్ధిదారుల ఖరారుపై వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ నెల 12 నాటికి కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతుంది. ఆరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అదే వేదికపై తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
Read Also: షర్మిలకు రోకలి పోటుగా ఆమె.. హై కమాండ్ సీరియస్!
రెండు విడతల్లో ప్రతిపాదన..
మరోవైపు ఈ పథకాన్ని రెండు విడతల్లో అమలు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే ఒకే విడతలో ఇవ్వడం మంచిదనే తుది అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య, కావాల్సిన నిధులపై ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) తొలి విడత నిధులు కూడా జమ చేయాల్సి ఉంది. అయితే ముందుగా తల్లికి వందనం అమలు చేయాలని స్ట్రాంగ్ గా నిర్ణయించారు. ప్రాథమికంగా 69.16 లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చింది. గత ప్రభుత్వం మాదిరిగానే 75% హాజరు నిబంధన కొనసాగనుంది. ఇక విద్యాశాఖ, వార్డు సచివాలయ డేటాకు అనుగుణంగా లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. అయితే రేపటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానుండడం.. కూటమి ఏడాది పాలన పూర్తి కానుండడంతో.. అదే రోజు పథకం అమలు చేస్తారన్న అంచనాలు ఉన్నాయి.
వాటి విషయంలో మినహాయింపు?
మరోవైపు ఇప్పటివరకు మార్గదర్శకాలు( guidelines) లేవు. వైసిపి ప్రభుత్వం అమ్మ ఒడి అమలు చేసినప్పుడు చాలా రకాల నిబంధనలు ఉండేవి. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారు, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారు, కారు కలిగి ఉన్నవారు, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అందలేదు అప్పట్లో. అయితే అప్పట్లో ఈ నిబంధనలను వ్యతిరేకించింది కూటమి. అందుకే ఇప్పుడు వీటి విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే మార్గదర్శకాల జారీ లేకుండా నేరుగా పథకం అమలు చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.