Scholarship scheme: దేశంలోని బీడీ కార్మికుల పిల్లలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోంది. కేంద్ర ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి స్కాలర్షిప్ పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు.. బీడీ కార్మికుల పిల్లలు అయి ఉన్నవారు అర్హులని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారు ఆయా కేటగిరిలో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 31 లోగా దరఖాస్తు సమర్పించుకోవాలని ఉపాధి శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7.2 లక్షల మంది వీడి కార్మికులు ఉన్నారు. వీరికి సంబంధించి 8.5 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో ఒకటి నుంచి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు ఈనెల 30 వ తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటర్ నుంచి ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారు 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలోని ఆయా జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు www.scolorahips.gov.in. అనే వెబ్సైట్లోకి వెళ్లి కావలసిన వివరాలు అందించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అయితే ఆయా తరగతుల్లో నేరుగా ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ స్కాలర్షిప్ చేసుకోవడానికి అర్హులు. సప్లమెంటరీలో ఉత్తీర్ణత పొందిన వారికి అవకాశం లేదు.
ఈ దరఖాస్తుల్లో అర్హత పొందిన వారు ఒకటి నుంచి 4వ తరగతి వారికి రూ.1,000.. ఐదు నుంచి 8వ తరగతి వరకు రూ.1,500.. 9 నుంచి 10 వ తరగతి వరకు రూ.2,000 ఉపకార వేతనం పొందవచ్చని అన్నారు. అలాగే ఇంటర్ చదివేవారు రూ.3,000.. డిగ్రీ ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసేవారు రూ.6,000.. బీటెక్, బి ఏ ఎం ఎస్ చేసేవారు రూ.25,000 వరకు ఉపకార వేతనం పొందవచ్చని పేర్కొన్నారు. అర్హులైన వారు సమీప మీసేవ కేంద్రాల్లో లేదా ఆన్లైన్ సెంటర్లలో వీటిని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ లను అందిస్తుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని బీడీ కార్మికులకు సరైన ఆదాయం లేకపోవడంతో తమ పిల్లలను చదివించలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ ఆర్థిక సహాయం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ఈ ఉపకార వేతనాల వల్ల అక్షరాస్యతను కూడా పెంపొందించే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనంతో బీడీ కార్మికులకు అదనపు ఆర్థిక భారం లేకుండా ఉండగలుగుతుందని భావిస్తుంది. ఉన్నత చదువులు చదివే వారికి సైతం ఉపకార వేతనాలు అందించడం తో వారి చదువుకు ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉంటాయని తెలుస్తోంది.