CM Revanth Reddy: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై ఫోకస్‌ పెట్టింది. గత ప్రభుత్వం నోటిషికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించిన నర్సింగ్, ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలు ప్రకటించి నియామక ఉత్తర్వులు ఇచ్చింది. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిషికేషన్‌ ఇచ్చి ఇటీవలే పరీక్ష నిర్వహించింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.

Written By: Raj Shekar, Updated On : August 27, 2024 4:06 pm

CM Revanth Reddy(1)

Follow us on

CM Revanth Reddy: నిరుద్యోగుల వ్యతిరేకత కారణంగానే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈమేరకు ఉద్యోగాల భర్తీపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే 30 వేల మందికి నియామక పత్రాలు అందించింది. తాజాగా డీఎస్సీ పరీక్ష నిర్వహించింది. 11,062 వేల పోస్టుల ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డీఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అక్టోబరు నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవి కాగానే కొత్త డీఎస్సీని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డిసెంబరు లేదా జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసి, జూన్, జూలైలోపు నియామకాలను పూర్తి చేసేలా ప్రణాళిక ఖరారు చేయాలని భావిస్తున్నారు. గ్రూప్‌–1, 2, 3, 4 ఉద్యోగాలకు కూడా వచ్చే ఏడాది ప్రారంభంలో నోటిఫికేషన్‌ ఇచ్చే ఆలోచనలో ఉంది.

ఖాళీల సేకరణ..
పాఠశాలల సంఖ్య, అందులోని విద్యార్థులు, ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన డీఎస్సీ ద్వారా నియమితులయ్యే ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటాయన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. పాఠశాలల్లో ఖాళీలు ఉన్నా.. వాటిని భర్తీ చేయడంలో సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. దీంతో చాలాచోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నా.. అందుకుతగ్గట్లుగా విద్యార్థులు లేరు. ఇలాంటి సందర్భంలో క్రమబద్ధీకరణను అమలు చేయాలి. ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం జరగడం లేదు. ఈ పనిచేసిన తర్వాతనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటే ప్రయోజనం అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

త్వరలో వీసీల నియామకం..
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్‌ ఛాన్స్‌లర్లను నియమించడానికి వీలుగా సెర్చ్‌ కమిటీ సమావేశాలను పూర్తి చేయాలని విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం వర్సిటీలకు ఐఏఎస్‌ అధికారులు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీసీల నియామకం కోసం ప్రభుత్వం నోటీఫికేషన్‌ కూడా ఇచ్చింది. ప్రొఫెసర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను వడపోసి వీసీలను ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వారీగా సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. 2, 3 రోజుల్లో ఈ కమిటీల సమావేశం షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది. దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించనున్నారు. వీరిలో ఒకరిని ఆయా యూనివర్సిటీలకు వీసీలుగా ఎంపిక చేసి ఆ జాబితాను ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదానికి పంపనుంది. ఇదంతా పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతుంది.

ఉన్నత విద్యా మండలికి కొత్త చైర్మన్‌..
విశ్వవిద్యాలయాల వీసీలతో పాటు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఇతర సభ్యుల నియామకంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుత చైర్మన్, సభ్యులు గత ప్రభుత్వంలో నియమితులైనవారు. ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రిని కొనసాగిస్తూ, కొత్త సభ్యులను నియమించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్నత విద్యా మండలిలో కొత్తవారిని నియమించాలని భావించారు. వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ, ప్రవేశాలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేశారు. ప్రస్తుతం దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు పూర్తయి, ప్రవేశాలు చివరి దశకు చేరాయి. విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలను కూడా నియమిస్తుండడంతో.. ఉన్నత విద్యా మండలి నియామకాలను కూడా చేపట్టాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.