JEE Main Results: జాతీయస్థాయి ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) జనవరిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) మెయిన్స్(JEE mains) సెషన్–1 పరీక్షలు నిర్వహించింది. నాలుగు రోజుల క్రితం ఫైనల్ కీని విడుదల చేసిన ఎన్‌టీఏ.. తాజాగా తుది ఫలితాలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ అందుబాటులో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా బాలికల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుత్తికొండ మనోజ్ఞ(Guttikonda Manogna) సత్తా చాటింది. 100 పర్సంటైల్ సాధించిన ఏకైక విద్యార్థినిగా నిలిచింది. ఇక తెలంగాణకు చెందిన బని బ్రాత సైతం 100 పర్సంటైల్ సాధించారు. జాతీయ స్థాయిలో మొత్తం 14 మంది వంద పర్సంటైల్ సాధించారు.
ఏడు రోజులు పరీక్ష..
జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు జనవరి 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించింది ఎన్‌టీఏ. మొత్తం దేశ వ్యాప్తంగా 13.11 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 12.58 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక తుది ఫలితాలను వెల్లడించగా, ఇందులో రాజస్థాన్(Rajasthan) నుంచి అత్యధికంగా ఐదుగురు వంద పర్సంటైల్ సాధించారు. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)కు చెందిన కోటిపల్లి యశ్వంత్‌సాత్విక్ 99.99 పర్సంటైల్ సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
ఏప్రిల్‌లో షెషన్2 పరీక్షలు..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించాలని ఎన్‌టీఏ(NTA) నిర్ణయించింది. ఈమేరకు తేదీలు కూడా ఖరారు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సెషన్2 కోసం ఫిబ్రవరి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సెషన్–1, సెషన్–2లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advance)రాసే అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందవచ్చు. మెయిన్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 23 ఐఐటీల్లో, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు కేటాయిస్తారు.