America: విదేశీ విద్యా, విదేశీ ఉద్యోగాలు.. డాలర్ డ్రీమ్ నెరవేర్చుకునేందుకు భారతీయ యువత ఏటా విదేశాలకు వెళ్తోంది. ఇలా విదేశీ బాటపడుతున్నవారిలో అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తున్నవారే ఎక్కువ. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు విదేశాలకు వెళ్తే విద్యార్థులకు రుణసాయం చేస్తున్నాయి. దీంతో చాలా మంది అమెరికానే తొలి ప్రాధాన‍్యంగా ఎంచుకుంటున్నారు. మరోవైపు అమెరికాలోని యూనివర్సిటీల్లో సీటు కోసం తల్లిదండ్రులు ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. ఇలా డాలర్ డ్రీమ్ నెరవేర్చుకునేందుకు అమెరికా వెళ్తున్నవారు ఏటేటా పెరుగుతున్నారు. దశాబ్దకాలంలో భారత్ నుంచి అమెరికా వెళ్తున్న విద్యార్థులు, యువకుల సంఖ్య 8 రెట్టు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలోనే అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగింది. ప్రపంచలో మరే దేశం కూడా అమెరికాలా భారత విద్యార్థులను ఆకట్టుకోలేకపోతోంది.
ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్లు..
ఇక భారతీయ విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధిస్తున్నారు. అమెరికా యూనివర్సిటీల్లో చేరుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 0.2 శాతం ఉండగా, పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో(3 శాతం), మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో(4 శాతం) ఉండడం గమనార్హం. ఇక కోర్సుల విషయానికి వస్తే సైన్స్, మ్యాథ్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఎక్కువమంది చేరుతున్నారు. యూజీ ప్రోగ్రామ్‌లవైపు భారత మధ్యతరగతి యువత ఆసక్తి చూపడం క్రమంగా పెరుగుతోంది.
విదేశాల్లో 15 లక్షల మంది..
ఇక ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నట్లు అంచనా. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు. 15 లక్షల మందిలో ఒక్క అమెరికాలోనే 2,69,000 మంది చదువుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలోనే ఈ సంఖ్య 35 శాతం పెరిగింది. అమెరికా యూనివర్సిటీల్లో మొన్నటి వరకు చైనా విద్యార్థులు ఎక్కువగా ఉండేవారు. గత విద్యాసంవత్సరం నుంచి ఆ స్థానాన్ని భారత్ సొంతం చేసుకునేలా దూసుకెళ్తోంది. నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డల్లాస్లలో చైనా విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. 1200 నుంచి 400లకు పడిపోయింది. అదే సమయంలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3,000 నుంచి 4,400లకు పెరిగింది.
అమెరికాకు ఆర్థిక వనరుగా..
ఇక అంతర్జాతీయ విద్యార్థుల తాకిడి, భారీగా ట్యూషన్ ఫీజులు వసూలు చేసే అమెరికా యూనివర్సిటీలు, కాలేజీలకు ఆర్థిక వనరుగా మారుతోంది. దీంతో భారత్‌లోని టైర్ 2, టైర్ 3 పట్టణాలపై దృష్టి పెడుతోన్న అమెరికా విద్యాసంస్థలు.. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ కార్యక్రమాల ద్వారా భారత్‌తో బంధాలను మరింత పెంచుకుంటున్నాయి.