
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. 2020 సంవత్సరంలో కరోనా వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ కరోనా భయాందోళనకు గురి చేసింది. భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం లేదని ప్రజలు భావిస్తున్నారు. దేశంలో క్రమంగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం కాగా కొన్ని రాష్ట్రాల్లో రేపటి నుండి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇతర రంగాలతో పోల్చి చూస్తే విద్యా రంగంపై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడగా లాక్ డౌన్ నిబంధనల వల్ల పాఠశాలలు కొన్ని నెలల పాటు మూతబడ్డాయి. అయితే ఇప్పటికే స్కూళ్లను ప్రారంభించిన పలు దేశాలు కరోనాకు చెక్ పెట్టేందుకు వింత నిబంధనలను అమలు చేస్తున్నాయి.
కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైన ఫ్రాన్స్ లో జూన్ లో పాఠశాలలు తెరుచుకోగా పిల్లలు ప్రతిచోటా మాస్క్ ధరించేలా, గుంపులుగా నిలబడకుండా చర్యలు చేపట్టారు. ఇటలీలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు సిలబస్ పూర్తి చేయడం కొరకు అక్కడి విద్యార్థులకు సెలవు దినమైన శనివారాల్లో కూడా తరగతులు జరగుతున్నాయి.
కెనడా ప్రభుత్వం విద్యార్థులు, టీచర్లను మాస్కులకు బదులుగా ఫేస్ షీల్డ్ లను వినియోంచాలని సూచించింది. చైనాలో పాఠశాలల్లో విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ తో పాటు తరచూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెదర్లాండ్స్ లో ఫ్లెక్సీ గ్లాజ్ లను ఒక విద్యార్థికి మరో విద్యార్థికి కాంటాక్ట్ ఉండకుండా చేశారు. డెన్మార్క్ లో కరోనా నియంత్రణ కొరకు షిఫ్ట్ ల వారీగా తరగతులను నిర్వహిస్తున్నారు.