Dr. Krishna Chivukula : దేశంలోని విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు చేసి ఉన్నత స్థానాలకు ఎదిగిన పూర్వ విద్యార్థులు వాటికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాను చదువుకున్న విద్యా సంస్థ ఐఐటీ బాంబేకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన నిలేకని ఏకంగా రూ.315 కోట్లు విరాళం ఇచ్చారు. దేశంలో ఒక పూర్వ విద్యార్థి ఇంతమొత్తంలో విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి. తాజాగా మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థి ఏకంగా రూ.228 కోట్లు విరాళం ప్రకటించి తన ఉదారత చాటుకున్నారు. ఇంత భారీ విరాళం ప్రకటించింది ఓ తెలుగు వ్యక్తి. అమెరికాలో స్థిరపడిన అతను శివ టెక్నాలజీస్, ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణా చివుకుల. అమెరికాలో స్థిరపడినా.. ఆయనకు మాతృదేశంపై ఎంతో మమకారం. అందుకే ఇక్కడి పేద పిల్లల విద్యకోసం తనవంతు సహకారం అందిస్తూ ఉన్నారు. తాజాగా తాను ఇంజినీరింగ్ చదివిన ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం తాజాగా ప్రకటించారు. మద్రాస్ ఐఐటీ నిబంధనల ప్రకారం ఎవరైనా విరాళాలు ఇస్తే.. విరాళం ఇచ్చే వ్యక్తులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణా చివుకుల అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి.. అమెరికాలో స్థిరపడి..
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన డాక్టర్ కృష్ణా చివుకుల మధ్య తరగతికి చెందిన విద్యావంతలు కుటుంబంలో పుట్టారు. 1968లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్ పూర్తి చేశారు. మద్రాస్ ఐఐటీ నుంచి 1970లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఆయన ఎంటెక్ పూర్తిచేశారు. అనంతరం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, కర్ణాటకలోని తుముకూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ అందుకున్నారు. తన 37వ ఏటా అమెరికాలోని ప్రముఖ హాఫ్మన్ సంస్థకు తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించి రికార్డు సృష్టించారు.
సొంతంగా వ్యాపారం..
హాఫ్మన్ సంస్థ నుంచి బయటకొచ్చిన కృష్ణా చివుకుల.. న్యూయార్క్‌లో సొంతంగా శివ టెక్నాలజీస్‌ను నెలకొల్పారు. మాస్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నాలజీలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. భారత్‌లోని బెంగళూరులోనూ దీనిని ఏర్పాటుచేశారు. భారత దేశంలో మొదటిసారి 1997లో మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ (ఎంఐఎం) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే. కొన్నాళ్లకు బెంగళూరు కేంద్రంగా ‘ఇండో ఎంఐఎం’ సంస్థను ప్రారంభించిన ఆయన.. తర్వాత ‘ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు. భారత దేశంలో ఈ సంస్థ వార్షిక టర్నోవర్ రూ.1000 కోట్లకు పైనే ఉంటుంది. 2009లో చిత్తూరు జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను కూడా స్థాపించారు.
సామాజిక సేవ..
ఇక కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) కింద కృష్ణా చివుకుల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2020లో రూ.5.5 కోట్లతో ఐఐటీ మద్రాసులోని 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించారు. 2014లో ఐఐటీ–ఎంశాట్ పేరుతో శాటిలైట్ రూపకల్పనకు రూ.1.5 కోట్ల సాయాన్ని అందించి, స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలను అందజేస్తున్నారు. బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లోని 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బెంగళూరులో బాప్టిస్ట్ ఆస్పత్రిలో పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. కర్ణాటకలోని చామరాజనగర్‌లో ఓ పాఠశాలను దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. తాజాగా మద్రాస్ ఐఐటీకి ఏకంగా రూ.228 కోట్లు విరాళంగా ప్రకటించారు. డాక్టర్ కృష్ణా చివుకుల ఐఐటీ మద్రాస్ నుంచి 2015 సంవత్సరంలో విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారం, తుమకూరు విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) అందుకున్నారు. అతను బెంగుళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ సలహాదారుల బోర్డులో కూడా పనిచేస్తున్నాడు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More