Interview Questions : ఎలాంటి జాబ్ కావాలన్నా కచ్చితంగా రాత పరీక్ష ఆ తర్వాత ఇంటర్వ్యూ కామన్ గా ఉంటాయి. మరి పరీక్ష అయితే తెలిస్తే రాస్తాము. లేదంటే ఏదో తెలిసింది రాస్తాము. మరి ఇంటర్వ్యూ అయితే చాలా కష్టం కదా. కొత్త ప్లేస్, కొత్త మనుషులు అడిగింది తెలియకపోతే ఏం సామాధానం చెప్పాలో తెలియదు. ఇలాంటి వారు ఏం చేయాలో తెలియక చాలా సతమతం అవుతారు. అలాంటప్పుడు మనం ఇప్పుడు తెలుసుకోబోయే టిప్స్ పాటించండి. మీకు చాలా ఈజీగా అవుతుంది.
ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మీకు అర్థం కాకపోతే మళ్లీ ఒకసారి అడగమని విజ్ఞప్తి చేయండి. లేదంటే మరో విధంగా అడగమని చెప్పండి. కొన్ని సార్లు ప్రశ్నను విభిన్న రీతుల్లో అడుగుతారు. మీకు అర్థం కానప్పుడు ఆ ప్రశ్నను మళ్లీ ఒకసారి అడిగితే తప్పు లేదు. లేదంటే వేరే విధంగా అడగమని చెప్పినా తప్పులేదు. ఇది చేయడం మాత్రం మరిచిపోకండి.
కొన్ని సందర్భాల్లో రీఫ్రేమ్ చేసినా కూడా ఆ ప్రశ్న గురించి మీకు సమాధానం తెలియకపోవచ్చు. ఈ విషయంపై అవగాహన ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో తెలియని సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడకుండా మీకు తెలిసిన విషయం గురించి మాట్లాడండి. ఆ వైపుగా వారిని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఇంటర్వ్యూ సులభం అవుతుంది. మీకు ఏ విషయంలో ఎక్కువ అవగాహన ఉందో అర్థం అయి ఆ విషయాల గురించి అనుకోకుండానే ప్రశ్నలు అడుగుతారు.
ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు మీకు సమాధానం తెలియకపోతే ఆ అంశాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నట్టు తెలిసేలా మాట్లాడండి. ఈ ఉద్యోగంలో చేరితే మీ నైపుణ్యాలు వారి ఉద్యోగానికి ఉపయోగపడతాయి అనే విధంగా అర్థం అయ్యేలా చేయండి. అంతేకాదు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. కొత్త విషయాల మీద ఆసక్తి ఉన్నవారిని కరెక్ట్ పర్సన్ గా అనుకుంటారు.