NEET UG 2024 Results: నీట్‌ యూజీ తుది ఫలితాలపై గందరగోళం.. విడుదలైనట్లు ప్రచారం.. ప్రకటించలేదన్న కేంద్రం!*

దేశంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష ఫలితాలపై గందరగోళం కొనసాగుతోంది. ఇప్పటికే పేపర్‌ లీకేజీపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా, తాజాగా తుది ఫలితాలపై సోషల్‌ మీడియాలో ప్రచారం విద్యార్థులను టెన్షన్‌ పెడుతోంది.

Written By: Raj Shekar, Updated On : July 26, 2024 12:46 pm

NEET UG 2024 Results

Follow us on

NEET UG 2024 Results: మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం కేంద్రం కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నీట్‌ పరీక్ష నిర్వహించింది. అయితే ఈసారి నిర్వహించిన పరీక్ష గందరగోళానికి దారితీసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ.. షెడ్యూల్‌కు ముందే ఫలితాలు ప్రకటించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఫలితాలపై పలువురు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి డీవై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం .. ఆచితూచి నిర్ణయాలు ప్రకటిస్తోంది. 23 లక్షల మంది భవిష్యత్‌కు సంబంధించిన విషయం కావడంతో లోతైన విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. బిహార్‌ రాష్ట్రంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో పలువురిని అరెస్టు కూడా చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నీట్‌ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సెంటర్ల వారీగా నీట్‌ ఫలితాలు ప్రకటించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ వివరాలను కేంద్రాల వారీగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సవరించిన నీట్‌ తుదిఫలితాలను ప్రకటిస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. అయితే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మాత్రం సవరించిన మార్కులకు సంబంధించిన ఫలితాలను ఇంకా ప్రకటించలేదుని పేర్కొంది. విద్యార్థులు ఇప్పుడే ఫలితాలు చూసుకునే అవకాశం లేదని తెలిపింది. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న లింక్‌ పాతదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. నీట్‌ తుది ఫలితాలు విడుదలయ్యాయని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సవరించిన ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి నీట్‌ ఫలితాలపై విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.

ఫిజిక్స్‌లో ప్రశ్నకు మార్కుపై గందరగోళం..
ఇదిలా ఉంటే.. నీట్‌ ఎంట్రన్స్‌లో ఫిజిక్స్‌ విభాగంలో ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం ఎంచుకున్న కొంతమంది విద్యార్థులకు కలిపిన గ్రేస్‌ మార్కులు తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే సుమారు 4 లక్షల మంది 5 మార్కులు కోల్పోయారు. ఫిజిక్స్‌లో ఓ ప్రశ్నకు 12వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పాత సిలబస్‌ ప్రకారం తప్పుగా సమాధానం ఇచ్చిన కొంతమంది విద్యార్థులకు ఎన్టీఏ అదనపు మార్కులు కలిపింది. అయితే కచ్చితమైన ఒక సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు ఇవ్వొద్దని సుప్రీం కోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఇప్పటిఏ ఇచ్చిన మార్కులను ఉప సంహరించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే సుప్రీం కోరుట్లో విచారణ సందర్భంగా ఫిజిక్స్‌ విభాగంలో 29వ ప్రశ్నకు ఒకటి మాత్రమే సమాధానం అయినప్పుడు రెండు ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్థులకు ఎన్టీఏ మార్కులు కలిపిందని ఓ పిటిషనర్‌ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సరైన సమాధానంపై నివేదిక ఇవ్వాలని దేశించింది. దీని ఆధారంగా 4 మాత్రమే సరైన సమాధానం అని తెలిపింది. ఈ ఆప్షన్‌ ఎంచుకున్నవారికే మార్కులు కలపాలని ఆదేశించింది.

పాత లింక్‌ వైరల్‌..
ఇదిలా ఉంటే.. ఎన్టీఏ ఫలితాలు ప్రకటించిందన్న ప్రచారం.. గురువారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పాత లింక్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అది తాజా స్కోర్‌ కార్డ్‌ల ప్రకటనగా ప్రచారం చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. ఇంకా 1,563 మంది అభ్యర్థులకు రీటెస్ట్‌ నిర్వహించిన తర్వాత స్కోర్‌ కార్డులను అప్‌డేట్‌ చేసింది. తర్వాత ఫిజిక్స్‌ ప్రశ్నపై అభ్యంతరాలు, తర్వాత సుప్రీం ఆదేశాలతో మరోసారి అప్‌డేట్‌ చేయాల్సి వచ్చింది. సవరణ పూర్తయిన తర్వాత 23 లక్షల మంది అభ్యర్థుల ర్యాంకులను మారుస్తుందని కేంద్రం ప్రకటించింది.