JEE Main Results: జేఈఈ సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు జూన్ 23-29 మధ్య జరిగాయి. ఎన్టీఏ కీ విడుదల చేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో తాజాగా ఫైనల్ కీ విడుదల చేసింది. విజయవాడకు చెందిన పెనికలపాటి రవికిషోర్ 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకోవడం విశేషం.

దాదాపు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జేఈఈ మెయిన్ ఫైనల్ పరీక్షలు జులై 21 నుంచి ప్రారంభమవుతాయి. తరువాత రెండింటిలో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ఖరారు చేస్తారు. త్వరలో ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్కోరు కార్డులు https://jeemain.nta.nic.in/ లేదా https://nta.ac.in/ లో అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా రవికిషోర్ మాట్లాడుతూ తనకు ఫస్ట్ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రణాళికా బద్ధంగా చదవితేనే ర్యాంకు వచ్చిందని తెలిపాడు. రోజుకు కనీసం 16 గంటలు చదువుతూ అనుమానాలు నివృత్తి చేసుకుంటూ చదివానని పేర్కొన్నాడు. దీంతో ఫస్ట్ ర్యాంకు వచ్చినట్లు తెలిపాడు. జేఈఈ మెయిన్స్ లో కూడా మంచి ర్యాంకు తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.
రవికిషోర్ తండ్రి ఆదినారాయణ ఓ ప్రైవేటు ఉద్యోగి. తల్లి నందకుమారి ప్రభుత్వ ఉద్యోగి. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్ లో 961 మార్కులు సాధించాడు. శ్రీచైతన్యలో ఇంటర్ పూర్తి చేసి జేఈఈ మెయిన్స్ కు శిక్షణ తీసుకుంటున్నాడు. అందులో కూడా సత్తా చాటుతానని చెబుతున్నాడు. రవికిషోర్ గుంటూరు వాస్తవ్యుడు.