
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 7,000 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జగన్ సర్కార్ అతి త్వరలో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ హెల్త్ క్లినిక్స్ లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్-ఎంఎల్‌హెచ్‌పీ నియామకాలకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే రాష్ట్రంలోని వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ లో 2,920 మంది నియామకాలు పూర్తి కాగా జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి అనుమతులు వచ్చిన అనంతరం మిగిలిన ఉద్యోగాల భర్తీ జరగనుందని సమాచారం. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 8,402 సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జగన్ సర్కార్ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. ఈ ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం గమనార్హం. కరోనా కారణంగా ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడగా సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం.
వరుసగా జగన్ సర్కార్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తూ ఉండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలొ సైతం నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ జగన్ సర్కార్ నిరుద్యోగుల ప్రశంసలు పొందుతోంది.