
టిప్పు సుల్తాన్.. మైసూరును పాలించిన రాజు. ఈయన బ్రిటీష్ మూకలను ఎదిరించిన యోధుడుగా చరిత్ర చెబుతోంది. ఎంతో మంది ఈ విషయాన్ని ఏకీభవిస్తారు. అయితే.. హిందూత్వ వాదులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తారు. బ్రిటీష్ వారి సూచన మేరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారని ఆరోపిస్తారు. వారికి సామంతరాజుగా ఉన్న టిప్పు.. దేవాలయాల్లోని బంగారమంతా దోచి బ్రిటీష్ వాళ్లకు అప్పగించారని చెబుతున్నారు. మరి, వీటికి ఆధారాలు ఎంత వరకు ఉన్నాయి? వాటిల్లో వాస్తవం ఎంత? అన్నది వెలుగులోకి రావట్లేదుగానీ.. ప్రచారం మాత్రం సాగిపోతోంది. టిప్పు సుల్తాన్ అంశం వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని వెంటనే చర్చలోకి తెస్తున్నారు ఆయన వ్యతిరేకులు. ఇంతకీ వారు చెబుతున్న కథ ఏంటన్నది చూద్దాం.
భారతీయ రాజుల్లో చాలా మంది తమ సంపద, బంగారం మొత్తం దేవాలయాల్లోని నేలమాలిగల్లో భద్రపరిచేవారని చెబుతారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం అడుగు భాగంలో ఉన్న నేలమాళిగల్లో మూడు గదులు తెరిస్తే.. సుమారు 4 లక్షల కోట్ల విలువైన బంగారం, వజ్రాలు బయటపడ్డాయి. మరో పెద్ద గది ఇంకా తెరవాల్సి ఉంది. అందులో ఎంత ఉందో తెలియదు. ఈ లెక్కన మిగిలిన దేవాలయాల్లోనూ ఎంతో బంగారం ఉండొచ్చని, అదంతా బ్రిటీష్ వాళ్లు దోచుకెళ్లారని, దీనికి మధ్యవర్తిగా టిప్పు సుల్తాన్ ఉన్నాడనేది ఆయన వ్యతిరేకుల అభిప్రాయం.
నాటి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధిపతిగా ఉన్న రాస్ట్ ట్రైడ్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని చెబుతున్నారు. టిప్పు సుల్తాన్ చేత ఆలయాలపై దాడులు చేయించాడని, ఆ విధంగా బంగారం మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ ఖజానాకు తరలించారని అంటున్నారు. ఇలా.. మొత్తం ఆలయాలను కొల్లగొట్టినందుకు గానూ.. టిప్పు సుల్తాన్ ను రాస్ట్ ట్రైడ్ ఒక రోజు విందుకు ఆహ్వానించాడని, ఆ సమయంలోనే ఆయన తుపాకీతో కాల్చి టిప్పును చంపాడని చెబుతున్నారు.
ఆ తర్వాత ఈ బంగారం, వజ్రాలు మొత్తం ఓడల ద్వారా బ్రిటన్ కు తరలించారట. ఆ బంగారం, వజ్రాల విలువ దాదాపు 7 వేల బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందులో చాలా సొమ్మును తనవద్దే ఉంచుకున్నాడని, ఆ విధంగా ప్రపంచంలో ధనవంతమైన వ్యక్తిగా రాస్ట్ ట్రైడ్ నిలిచాడని చెబుతున్నారు. అంతేకాకుండా.. తన వద్ద ఉన్న మొత్తం సంపద వివరాలు బ్రిటన్ దేశానికి చెప్పలేదనీ, అమెరికా, ఇజ్రాయిల్ జాతీయ బ్యాంకుల్లో పెట్టుబడిగా పెట్టారని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప ధనవంతులుగా ఉన్నవారికన్నా ఎక్కువ సొమ్ము రాస్ట్ కుటుంబం వద్దనే ఉందని కూడా చెప్పుకొస్తున్నారు.
మరి, ఇప్పటి వరకు చెప్పుకున్న వాటికి ఆధారం ఏంటీ అన్నది మాత్రం పూర్తిగా ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. మరికొందరు.. టిప్పు సుల్తాన్ ముస్లిం కాబట్టి.. కావాలనే కొందరు ఆయనను దేశద్రోహిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. నిజానికి ఆయన బ్రిటీష్ వాళ్లను ఎదిరించారని, ఆ విధంగా వారితో జరిగిన పోరాటంలోనే చనిపోయాడని కూడా చెబుతున్నారు. చరిత్ర కూడా ఇదే చెబుతోందని అంటున్నారు. ఇప్పుడు కావాలనే కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా వివాదం సృష్టించే పనిచేస్తున్నారని కూడా అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఏంటన్నది తేలాల్సి ఉంది.