వెండి తెరపై మాఫియా సామ్రాజ్యాన్ని ఆవిష్కరించడంలో విశేషంలేదు. ఎందుకంటే.. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్రను కూడా మళ్లీ మళ్లీ సెల్యూలాయిడ్ పై ఆవిష్కరిస్తుండడమే ఇక్కడ విశేషం. తాజాగా.. దావూద్ జీవితంపై మరో సినిమా రాబోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఎందుకు దావూద్ వెంట పడుతోందనే చర్చ సాగుతోంది.
ముంబై మాఫియా సామ్రాజ్యంలో ఎంతో మంది డాన్ లు ఉన్నారు. వారి కథలు కూడా సినిమాలుగా వచ్చాయి. వారిలో దావూద్ నుంచి చోటా రాజన్, మాయ డోలాస్, మాన్య సుర్వే.. వంటి ఎందరో జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చాయి. అయితే.. వీరిలో దావూద్ ఇబ్రహీం చరిత్ర మాత్రమే మళ్లీ మళ్లీ తెరపై ఆవిష్కృతం అవుతుండడం విశేషం.
ఇప్పటి వరకు బాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ నుంచి అనురాగ్ కశ్యప్ వరకు చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముంబై మాఫియా డానల్ జీవితాలను చూపించారు. అనురాగ్ కశ్యప్ ‘బ్లాక్ ఫ్రైడే’, రామ్ గోపాల్ వర్మ ‘కంపెనీ’, నిఖిల్ అద్వానీ ‘డి డే’ సినిమాలు దావూద్ చరిత్రచుట్టూనే తిరుగుతాయి. దావూద్ సోదరిపై ‘హసీనా పార్కర్’ అనే సినిమాతోపాటు ‘ఏక్ థీ బేగం’ అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది.
అయితే.. తాజాగా రామ్ గోపాల్ వర్మ మరోసారి దావూద్ కథను ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ‘డి కంపెనీ’ పేరుతో వర్మ తీస్తున్న ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా దావూద్ ఎదిగిన క్రమాన్ని చూపించబోతున్నట్టు ఆర్జీవీ చెబుతున్నారు. 2002లో వచ్చిన కంపెనీ సినిమాలో దావూద్ ఇబ్రహీం-చోటా రాజన్ మధ్య యుద్ధాన్ని చూపిస్తే.. ఈ డీ కంపెనీ ద్వారా డాన్ గా దావూద్ జీవితం ఎలా ప్రారంభమైందన్న విషయాన్న చూపించబోతున్నట్టు చెబుతున్నారు ఆర్జీవీ.
ఒక గ్యాంగ్ స్టర్ ను హీరోగా చూపించడం సరైందేనా అని అడిగితే.. తాను హీరోగా చూపించడం లేదని వాళ్ల జీవితాలను మాత్రమే చూపిస్తున్నానని, అది వాళ్ల నిజస్వరూపం అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. మందు గ్లాసు పట్టుకుంటే, మీరోతో తలపడితే దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన, అది కేవలం సినిమానే అని చెప్పడం గమనార్హం.
ఇన్ని సినిమాలు వచ్చినా.. ఇంకా దావూద్ చరిత్రతో సినిమాలు తీయడానికి కారణం ఏమంటే.. దానికి వర్మ ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. ప్రజలకు, మీడియాకు క్రైమ్ అంటే ఆసక్తి ఎక్కువ. తమకు తెలియని నేరాల గురించి చెబితే.. కన్నార్పకుండా చూస్తారు. అందుకే.. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
అయితే.. ట్రేడ్ పండితులు మాత్రం.. గ్యాంగస్టర్ ఫార్ములా పాతబడిందని చెబుతున్నారు. బాక్సీఫీస్ వద్ద బిజినెస్ ను కొన్నాళ్లుగా పరిశీలిస్తే.. ఈ తరహా సినిమాలు అద్భుతాలు చేయట్లేదని చెబుతున్నారు. మొదట్లో అండర్ వరల్డ్ సినిమాలు బాగానే నడిచినప్పటికీ.. ఇప్పుడు అంతగా ప్రభావం చూపించట్లేదని చెబుతున్నారు. మరి, వర్మ ‘డీ కంపెనీ’తో అద్భుతం సృష్టిస్తాడా? అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్