
గతేడాది చైనాలోని వుహాన్ లో కొవిడ్-19 వెలుగు చూసింది మొదలు.. ఇప్పటి వరకు ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్నో ఆరోపణలు.. మరెన్నో విమర్శలు వచ్చాయి. ఇందులో మెజారిటీ చైనాను నిందించేవి కావడం గమనార్హం. వుహాన్ ల్యాబ్ లో ఈ వైరస్ ను కృత్రిమంగా తయారు చేస్తున్నారని, ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ బయట పడిందని కూడా విశ్లేషణలు వచ్చాయి. అయితే.. ఇదంతా అసత్యమని చైనా వాదిస్తూ వచ్చింది. కానీ.. తాజా వెలుగు చూసిన ఓ వార్త మరోసారి అనుమానాలను కలిగిస్తోంది.
ఆ స్ట్రేలియాకు చెందిన మీడియా ఈ మేరకు కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. 2015లోనే కరోనా వైరస్ తో ఆయుధాలను తయారు చేయడంపై చైనా శాస్త్రవేత్తలు చర్చించారట. మూడో ప్రపంచ యుద్ధం అనేది జరిగితే.. అది జీవాయుధాలతోనే అని చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు ఒక పత్రంలో పేర్కొన్నట్టు ఆస్ట్రేలియన్ మీడియా తెలిపింది. సార్స్ కరోనా వైరస్ లను నూతన శకం జీవాయుధాలుగా డ్రాగన్ భావిస్తోందని వెల్లడించింది.
జీవాయుధాలతో దాడిచేస్తే శత్రుదేశం వైద్య వ్యవస్థ, ఆర్థికవ్యవస్థ కుప్ప కూలిపోతుందని చైనా సైన్యం భావిస్తోందట. కరోనా వైరస్ 2019లో బయటపడినప్పటికీ.. అంతకు ఐదేళ్ల ముందు నుంచే చైనా సైన్యంలోని శాస్త్రవేత్తలు ఇలాంటి వైరస్ తో ఆయుధాలను తయారు చేయడంపై చర్చిస్తున్నట్టు ఆ మీడియా కథనం తెలిపింది.
కాగా.. దీన్ని బలపరిచే పలు పత్రాలు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు లభించినట్టు మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్లు ఎలాంటి దారుణాలకు పాల్పడతారో ఇవి రుజువు చేస్తున్నాయని యూకేకు చెందిన ‘ద సన్’ పేర్కొంది. వుహాన్ వైరస్ వెనక ఉన్న సీక్రెట్లను ప్రపంచం ముందు ఉంచేందుకు త్వరలోనే ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించినట్టు సమాచారం.
వుహాన్ ల్యాబ్ లో తయారు చేస్తున్న వైరస్ ప్రమాదవశాత్తూ బయటపడిందన్న సందేహాలకు ఈ కథనాలు మరింత బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు. వుహాన్ ల్యాబ్ పరిశీలనకు ఇతర మీడియాను అనుమతించకపోవడం కూడా కారణంగా చూపిస్తున్నారు. కేవలం వుహాన్ మార్కెట్ ను మాత్రమే సందర్శిస్తామంటే చైనా అనుమతించేదని.. అసలు వైరస్ ఎలా పుట్టిందనే మూలాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో చైనా అడ్డుకుందని ఆస్ట్రేలియా వ్యూహాత్మక విధానాల సంస్థ కార్యనిర్వాహక అధినేత పీటర్ జెన్నింగ్స్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే.. ఇందులో వాస్తవం లేదని చైనా చెబుతోంది.