Nagole Crime News: చేతిలో చంటిబిడ్డ.. వయసు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది.. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. ఈ స్థితిలో తన ఇంటికి వచ్చిన ఆమెను చూసిన అతడు చలించిపోయాడు. మానవతావాదిగా తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. అదే అతడు చేసిన నేరమైంది. ఆ సంఘటన అతడిని నిందితుడిని చేసింది.నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
మహబూబాబాద్ జిల్లా రెడ్యాల చెందిన ఓ మహిళకు భర్త, కుమారుడు ఉన్నాడు. కుమారుడి వయసు మూడు సంవత్సరాలు. ఆ మహిళకు 38 సంవత్సరాల దాకా వయసు ఉంటుంది. ఆ మహిళ కుటుంబం నివసించే సమీపంలోనే బానోతు అనిల్ నాయక్ అనే యువకుడు నివసిస్తున్నాడు. నాగోల్ ప్రాంతంలోని అంధుల కాలనీలో వీరు ఉంటున్నారు. ఈనెల 20న ఆ మహిళ తన కుమారుడిని తీసుకొని ఆసుపత్రికి బయలుదేరింది. ఇదే విషయాన్ని ఇంట్లో కూడా చెప్పింది. ఆమె నేరుగా అనిల్ వద్దకు వచ్చింది. 21వ తేదీ వరకు వారిద్దరూ కలిసి ఉన్నారు. ఈ విషయాన్ని అనిల్ బయటికి చెప్పలేదు. బయటికి చెబితే ఏమైనా అవుతుందేమోనని భయంతో అతడు ఈ విషయాన్ని దాచాడు.. ఆ తర్వాత మరుసటి రోజు కూరగాయలు కొనుగోలు చేయడానికి అనిల్ బయటికి వెళ్లాడు. ఇంతలోనే ఆ మహిళ బాత్రూం వెళ్ళింది. బాత్రూం హ్యాంగర్ కు ఉరివేసుకుంది..
కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వచ్చిన అనిల్ కు ఆ మహిళ కనిపించలేదు. దీంతో అతడు బాత్రూం డోర్ ను గట్టిగా కొట్టాడు. అతి కష్టం మీద బాత్రూం డోర్ ను పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. ఇప్పటికే ఆ మహిళ తుది శ్వాస విడిచింది. ఆమె మరణించడంతో అతడికి ఒక్కసారిగా భయం వేసింది. దీంతో అతని కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కత్తితో చేతిని కోసుకున్నాడు. ఇంతలోనే ఆ మహిళ కుమారుడు అక్కడికి వచ్చి.. తన తల్లి నుంచి ఎటువంటి ఉలుకు పలుకు లేకపోవడంతో ఏడుపు మొదలు పెట్టాడు. దీంతో చేతికి దస్తి కట్టుకొని.. ఆ యువకుడు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు ఈ సమాచారాన్ని మృతురాలి బంధువులకు అందించారు. దీంతో వారు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అనిల్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సముదాయించి పంపించారు. అయితే అనిల్ నాయక్ తో ఆ మహిళకు ఎటువంటి సంబంధం ఉంది? ఆసుపత్రికి వెళ్తానని చెప్పి నేరుగా ఇతడి ఇంటికి రావడం ఏమిటి? భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. కుమారుడితో ఒక్కతే రావడం వెనక ఏం జరిగి ఉంటుంది? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.