Health Tips: మనం వాడే మందులకు మాత్రమే కాదు.. ఉపయోగించే వస్తువులకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ లో గానే వస్తువులను వాడాలి
ఆ తర్వాత పక్కన పడేయాలి. ఆ.. అలాగే వాడితే ఏమవుతుందట.. అని అనుకుంటూ ఉపయోగిస్తే లేనిపోని ఇబ్బందులు.. దుష్పరిణామాలు కలుగుతాయట.. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మనం ఉదయం లేవగానే వాష్ రూమ్ వెళ్తాం. ఆ తర్వాత బ్రష్ చేస్తాం. వెనుకటి కాలంలో చాలామంది వేప పుల్లలతో దంతాలు తోముకునేవారు. ఇప్పుడు వేప పుల్లలతో దంతాలు తోముకునే వారు లేరు. వేప పుల్లలు తెచ్చుకునే ఓపికా ఎవరికీ లేదు. అందువల్లే మెజారిటీ ప్రజలు ప్లాస్టిక్ బ్రష్ తోనే దంతావధానం పూర్తి చేస్తున్నారు. అయితే మనలో చాలామంది బ్రష్ ను ఎక్కువ రోజులు వాడుతుంటారు.. వాస్తవానికి టూత్ బ్రష్ అనేది ఎక్కువ రోజులు వాడకూడదు. అలా వాడితే అది చేసే మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుందట. నిపుణులు చెప్పిన దాని ప్రకారం టూత్ బ్రష్ మూడు నెలలు మాత్రమే వాడాలి. ఆ తర్వాత దాని స్థానంలో కొత్తదానిని కొనుగోలు చేసి వాడాలి. ఇక లోదుస్తులు కూడా ఆరు నుంచి 12 నెలలు మాత్రమే వాడాలి. ఆ తర్వాత కొత్తవి కొనుగోలు చేయాలి. ఇక ఆడవారు అయితే లోదుస్తులు 6 నుంచి 7 నెలల వరకు వాడటమే మంచిది. మనం ఇంటిని శుభ్రం చేసుకున్నందుకు ఉపయోగించే చీపురును ఒకటి నుంచి రెండు సంవత్సరాలు మాత్రమే వాడాలి. ఆ తర్వాత కొత్తదానిని కొనుగోలు చేయాలి. ఇక ఉపయోగించే పరుపు విషయంలో సైతం జాగ్రత్త పాటించాలి. ఏడు నుంచి పది సంవత్సరాల నుంచి పరుపును వాడకూడదు. దిండును కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. సన్ స్క్రీన్ 12 నెలలు మాత్రమే ఉపయోగించాలి. కిచెన్ లో ఉపయోగించే స్పాంజ్ ను రెండు నెలలకు ఒకసారి మార్చాలి.
ఇలా మార్చకపోతే దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయట. ముఖ్యంగా ఈ వస్తువులను మనం ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల వాటిలో రసాయనిక మార్పులు జరిగి శరీరంపై తీవ్రమైన ప్రభావాలు చూపిస్తాయట. పైగా ఈ ఉత్పత్తులను బ్రాండెడ్ కంపెనీలు తయారుచేసినవి మాత్రమే ఉపయోగించాలట. లేనిపక్షంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయట.. ఇక ఇటీవల కాలంలో రకరకాల ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. వాటి వినియోగంలోనూ జాగ్రత్తగా ఉండాలట. ముఖ్యంగా కిచెన్, దేహ సంరక్షణ, చర్మ సౌందర్యం, అంతర్గత అవయవాల రక్షణ కోసం ఉపయోగించే వాటిల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలట.