Ghost SIM Cards: సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సైబర్ నేరాలు ఆగడం లేదు. గతంలో ఫోన్లకు లింకులు పంపించి సైబర్ నేరగాళ్లు సర్వం దోచుకునేవారు. ఆ తర్వాత ఫోన్లు చేసి.. మీ పిల్లలు అరెస్టు అయ్యారని.. మీ పేరు మీద మాదకద్రవ్యాలు వచ్చాయని.. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని.. రకరకాల విధానాలలో మోసాలు చేసేవారు. అయితే ఇప్పుడు సరికొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ లో ఫోటో పంపించి.. అది ఓపెన్ చేయగానే.. దాని పేరు మీద పంపించిన మాల్ వేర్ ను తెలివిగా ఫోన్లోకి పంపిస్తున్నారు. ఆ తర్వాత ఖాతాల సమాచారాన్ని తస్కరిస్తున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టైటిల్ మార్పు..కొత్త టైటిల్ ఇదే..కారణం ఏంటంటే!
ఇటీవల కాలంలో అకౌంట్లో డబ్బులు పడ్డాయని.. చెక్ చేసుకోండి అంటూ బ్యాంక్ అధికారులు పంపించినట్టుగా సందేశాలు సెండ్ చేస్తున్నారు. వాటిని ఓపెన్ చేస్తే డబ్బులు యాడ్ అయినట్టు కనిపిస్తుంది.. ఉత్సాహం ఆగలేక ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లో బ్యాలెన్స్ చెక్ చేస్తే.. ఇక అంతే సంగతులు. సైబర్ నేరగాళ్లు తాము పంపించిన మాల్ వేర్ సహాయంతో మన ఖాతాలలోకి ప్రవేశిస్తారు.. ఆ తర్వాత మనకు తెలియకుండానే నగదును మొత్తం దోచుకెళ్తారు. వాస్తవానికి సైబర్ నేరగాళ్లు ఘోస్ట్ సిమ్ లను వాడి మోసాలకు పాల్పడుతున్నారు.. నకిలీ లేదా దొంగిలించిన గుర్తింపు కార్డులతో సిమ్ లు దక్కించుకుంటున్న నేరగాళ్లు.. వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఒకవేళ సిమ్ కార్డులు దొరికినప్పటికీ పోలీస్ అధికారులు ఏం చేయలేకపోతున్నారు.. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికాం రంగాలలో ఉన్న లోపాలను సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్ల పై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. పాయింట్ ఆఫ్ సేల్ కేంద్రాల ద్వారానే ఘోస్ట్ సిమ్ లు సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయని కేంద్ర దర్యాప్తు బృందం గుర్తించింది.. వాస్తవంగా మోసపూరితమైన విధానాలలో సిమ్ లు సొంతం చేసుకుంటున్న నేరగాళ్లు ఆ తర్వాత దర్జాగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వ్యవహారాలలో నేరస్తులను గుర్తించడం పోలీసులకు ఇబ్బందికరంగా మారుతుంది.
సైబర్ నేరగాళ్లు తన మోసాలకు ఏజెంట్లను నియమించుకుంటున్నారు. అయితే వీరిలో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఏజెంట్లు ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి 59 మంది, తమిళనాడు నుంచి 51 మంది, జమ్మూ కాశ్మీర్ నుంచి 46 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 41 మంది, ఢిల్లీ నుంచి 38 మంది ఈ నేరాలలో పాలుపంచుకుంటున్నారు.. సైబర్ నేరగాళ్లు ఉపాధి కల్పిస్తామని చెప్పి.. భారీగా జీతాలు ఇస్తామని చెప్పి భారత్ నుంచి యువకులకు వల వేస్తున్నారు. ఆ తర్వాత వారిని కంబోడియా, లావోస్, మయన్మార్ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఒక్క కంబోడియా లోనే 5000 మంది భారతీయులు ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగుల పేరుతో వారిని అక్కడికి పిలిపించుకున్న సైబర్ నేరగాళ్లు.. ఆ తర్వాత వారితో బలవంతంగా ఈ నేరాలను చేయిస్తున్నారు.. తప్పుదోవ పట్టించి రహస్య సమాచారాన్ని తెలుసుకోవడం.. నకిలీ అప్లికేషన్లు రూపొందించడం.. ఫిషింగ్ హెచ్చరికలు పంపడం.. వంచన వంటి వ్యవహారాలకు పాల్పడటం వంటి మోసాలను సైబర్ నేరగాళ్లు చేస్తున్నారు. భారీగా లాభాలు వస్తాయని.. కేవైసీ అప్డేట్ చేయించుకోవాలని.. డిజిటల్ అరెస్ట్ అయ్యారని.. మీ పేరుతో మాదకద్రవ్యాలు వచ్చాయని.. ఇలా రకరకాల రూపాలలో మోసాలు చేస్తూ భారీగా దండుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో 210 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారంటే వారి మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.