West Godavari: మూకీ, టాకీ నుంచి మొదలు పెడితే నేటి డిజిటల్ విప్లవం వరకు సినిమాలలో దయ్యం అనేది అద్భుతమైన హిట్ సరుకు.. జగన్మోహిని నుంచి మొదలుపెడితే మాసూద వరకు అన్ని సినిమాలు దయ్యం ఇతి వృత్తంతో రూపొందినవే. ఈ సినిమాలలో దయ్యాలు మనుషులను ఆవహిస్తాయి. ఆ తర్వాత మంత్రాలు, తంత్రాలతో అవి పారిపోతాయి. సినిమాలలో విపరీతమైన లిబర్టీ ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు తీస్తారు. ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తారు.
సినిమాల సంగతిని పక్కన పెడితే నిజ జీవితంలో దయ్యాలు ఉంటాయా? అవి మనుషులను ఆవహిస్తాయా? అసలు అలాంటిది జరుగుతూ ఉంటుందా.. ఈ ప్రశ్నలకు రకరకాల వ్యక్తులు భిన్నమైన సమాధానాలు చెబుతుంటారు. ఇందులో ఎవరి వాదన వారిదే. కొందరేమో దయ్యాలు అనేవి ఉండవని.. అదంతా అభూత కల్పన అంటూ కొట్టి పారేస్తుంటారు. మరికొందరేమో దయ్యాలు ఉన్నాయని.. అవి మనుషుల మీద పడుతుంటాయని చెబుతుంటారు. కొందరైతే తన పూర్వీకులు దయ్యాలుగా మారారని.. వారంతా తమకు కనిపిస్తున్నారని.. చెబుతుంటారు. ఇలా ప్రవర్తించే వ్యక్తులు కొన్నిసార్లు పైశాచికంగా వ్యవహరిస్తారు. ఇలా ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన తల్లిని, సోదరుడిని అంతం చేశాడు. అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. భీమవరం పట్టణంలోని సుంకర పద్దయ్య వీధిలో మహాలక్ష్మి కుటుంబం నివసిస్తోంది. ఈమెకు శ్రీనివాస్, రవితేజ అనే పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ సోమవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో పదునైన కత్తితో తన తల్లిని.. సోదరుడిని చంపేశాడు.
వారిద్దరిపై తనకు దయ్యాలు కనపడుతున్నాయని.. అందువల్లే చంపేశానని శ్రీనివాస్ పేర్కొన్నాడు. భారీ శరీరంతో ఉన్న శ్రీనివాస్ మహాలక్ష్మి, రవితేజ మీద అమాంతం పడిపోయి తన చేతిలో ఉన్న కత్తితో పదేపదే పొడిచి అంతం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల విచారణలో మహాలక్ష్మి రవితేజకు అధికంగా ప్రాధాన్యం ఇవ్వడంతోనే శ్రీనివాస్ తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు కొంతకాలంగా శ్రీనివాస్ మానసిక ఆరోగ్యం అంత మంచిగా లేదు. శ్రీనివాస్ ఒంటరిగా ఉండేవాడు. తనలో తాను మాట్లాడుకునేవాడు. అందువల్లే ఇంతటి దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తమను తప్పుదారి పట్టించడానికి దయ్యాలు పట్టాయని చెబుతున్నాడని… వాస్తవానికి అతడు చెప్పిన దాంట్లో నిజం లేదని పోలీసులు వివరిస్తున్నారు.