SI Sriramulu Srinu: అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్య కేసులో అనుకోని ట్విస్ట్.. సంచలన విషయాలు వెల్లడించిన సీఐ భార్య

జితేందర్ రెడ్డి పై కేసు నమోదు కావడంతో ఆయన భార్య శైలజ స్పందించింది.. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసింది.."ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నన్ను జితేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అటువంటి వ్యక్తి శ్రీనును కులం పేరుతో దూషించాడనే ఆరోపణలు రావడం చాలా బాధాకరం. జితేందర్ రెడ్డి 2003 -06 వరకు నాతోపాటు డిగ్రీ చదువుకున్నాడు. 2009లో ఎస్ఐగా ఉద్యోగం సాధించిన తర్వాత పెద్దలను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాం.. శ్రీను ఆత్మహత్య కేసును పోలీసులు జాగ్రత్తగా విచారణ చేయాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : July 7, 2024 4:28 pm

SI Sriramulu Srinu

Follow us on

SI Sriramulu Srinu: గత నెల 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో కన్నుమూశారు. శ్రీను పురుగుల మందు తాగిన విషయం తెలిసిన వెంటనే పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ముందుగా అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డిని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసింది. మిగతా నలుగురు కానిస్టేబుళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపించింది. ఇదే సమయంలో శ్రీరాముల శ్రీను భార్య ఫిర్యాదు చేయడంతో పోలీస్ శాఖ తదుపరి చర్యలకు సమాయత్తమవుతోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. పోలీస్ శాఖ కూడా గోప్యంగా విచారణ చేపడుతోంది.

జితేందర్ రెడ్డి పై కేసు నమోదు కావడంతో ఆయన భార్య శైలజ స్పందించింది.. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసింది..”ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నన్ను జితేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అటువంటి వ్యక్తి శ్రీనును కులం పేరుతో దూషించాడనే ఆరోపణలు రావడం చాలా బాధాకరం. జితేందర్ రెడ్డి 2003 -06 వరకు నాతోపాటు డిగ్రీ చదువుకున్నాడు. 2009లో ఎస్ఐగా ఉద్యోగం సాధించిన తర్వాత పెద్దలను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాం.. శ్రీను ఆత్మహత్య కేసును పోలీసులు జాగ్రత్తగా విచారణ చేయాలి. కుల సంఘాలు కూడా పారదర్శకత పాటించాలి. నాకు ఆరు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు, నాలుగు సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉంది. శ్రీను ఆత్మహత్య చేసుకోవడం దారుణం. అతని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నానని” శైలజ ఆ వీడియోలో పేర్కొంది.

మరోవైపు శ్రీను ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామం నారక్క పేటలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా పలువురు దళిత సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులను కూడా తమ అదుపులో ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలనకు శ్రీను ఆత్మహత్య సజీవ సాక్ష్యమని ఆరోపించారు. శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీను ఆత్మహత్య విషయం తెలియడంతో అతడి మేనత్త రాజమ్మ కూడా గుండెపోటుతో కన్నుమూసిందని పేర్కొన్నారు.. ప్రభుత్వం శ్రీను మరణం పై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.