Tragic Lift Accident: ఆమె పేరు లక్ష్మి.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉంటుంది. ఆమె కూతురు, అల్లుడు రాజేంద్రనగర్ ప్రాంతంలోని బండ్లగూడ లో ఉంటారు. అభివృద్ధిరాలు తన కూతుర్ని, అల్లుడిని చూసేందుకు వచ్చింది. లక్ష్మీ కూతురు, అల్లుడు బండ్లగూడ ప్రాంతంలోని మూన్ రాక్ అపార్ట్మెంట్స్ లో 4 అంతస్తులో నివాసం ఉంటున్నారు.
కూతురింట్లో ఉన్న ఆమె.. కాసేపు అలా బడలిక తీర్చుకుందామని కిందికి రావడానికి ప్రయత్నించింది. నాలుగో అంతస్తు నుంచి కిందికి రావడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. లిఫ్ట్ వచ్చిందనుకొని గ్రిల్ తీసింది. ప్రమాదవశాత్తు అందులో పడింది. నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ గుంతలో పడింది. ఫలితంగా తీవ్రంగా గాయపడింది. కింద ఇనుప మేకులు ఉండడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
తల్లి బయటికి వెళ్ళిందని ఆమె కూతురు అనుకుంది. కానీ లిఫ్ట్ గుంతలో పడిన విషయం ఆలస్యంగా గమనించింది. ఆ గుంత దగ్గరికి వెళ్లి చూసేసరికి.. అప్పటికే లక్ష్మీప్రాణాలు కోల్పోయింది. తల్లి తనను చూసేందుకు వచ్చి చనిపోవడంతో ఆ కూతురు కన్నీరు మున్నీరయింది. అయితే లిఫ్టును పర్యవేక్షించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కాలనీవాసులు అంటున్నారు. చాలా వరకు అపార్ట్మెంట్లలో లిఫ్ట్ ఇండస్ట్రీ ఆపరేటర్లు, స్పీడ్ గవర్నర్లు, ఎమర్జెన్సీ బ్రేకులు లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఇంతవరకు లిఫ్ట్ లకు సంబంధించి కొత్త పాలసీ అమల్లోకి రాలేదు. ఒకవేళ పాలసీ గనుక అమల్లోకి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని తెలుస్తోంది. పురపాలకాలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లోని అన్ని విభాగాలనుంచి నిర్మాణ అనుమతులు పొందడంతో పాటు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాన్ని పొందాలి. లిఫ్ట్ లతోపాటు, పెద్ద పెద్ద ఎలివేటర్లు నిర్మించుకోవడానికి భవన యజమానులు ఎలక్ట్రిక్ ఇన్స్పెక్షన్ విభాగం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇది జరిగితే విద్యుత్ తనిఖీ విభాగం విభాగం లిఫ్ట్ పాలసీ రూపకల్పన చేస్తుంది. హైదరాబాద్ నగరంలో మొత్తం మూడు వేల కోట్లకు పైగా లిఫ్ట్ పరిశ్రమకు సంబంధించిన పరికరాల వ్యాపారం జరుగుతోంది. ప్రతి ఏడాది దాదాపు 50,000 లిఫ్టుల ఉత్పత్తి జరుగుతోంది.