Uttar Pradesh : అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ ప్రాంతంలోని అశోక్ నగర్.. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను అక్కడి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నాడు. బంధువులు, ఇతరుల రాకతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. మొదటి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహం పూర్తయిన తర్వాత మరో కుమార్తె పెండ్లి జరుగుతోంది. పెళ్లి క్రతువులో భాగంగా వరుడితో పెళ్లి కుమార్తె మెడలో పూలమాల వేయించారు.. ఆ తర్వాత ఆ పెళ్లి కుమారుడు చేసిన పని.. పచ్చని పెళ్లి పందిరిని రణరంగం చేసింది.
వరమాల వేసిన తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నుదుటిమీద బహిరంగంగా ముద్దు పెట్టాడు. ఇది ఆ వధువు బంధువులకు తప్పుగా అనిపించింది. దీంతో వారు పెళ్లి కుమారుడి బంధువులతో వాగ్వాదానికి దిగారు. “ఇది పెళ్లి పందిరి అనుకుంటున్నారా.. శోభనం గది అనుకుంటున్నారా.. వరమాల వేసిన తర్వాత ఇలా చేయడం ఏంటి.. కొంచెం కూడా బుద్ధి ఉండక్కర్లేదా.. ఎలా పెంచారు ఇతడిని” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆ మాటలు వరుడి బంధువులకు ఇబ్బంది కలిగించాయి. వారు కూడా పట్టరాని ఆగ్రహంతో వధువు తరఫు బంధువుల మీదికి వెళ్లారు. ఇలా మాటా మాటా పెరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పెళ్లి వేదిక పక్కనే వంటలు చేయడంతో.. ఆ వంట చెరకు తాలూకూ కర్రలతో కొట్టుకున్నారు.
ఇరు వర్గాలు పరస్పరం కొట్టుకోవడంతో కళ్యాణ వేదిక ఒక్కసారిగా రణరంగంగా మారింది. పరిస్థితి చేయి దాటి పోతోందని భావించిన కొంతమంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని దాడిలో గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. “మా కుమార్తె నిరాకరించింది. అయినప్పటికీ అతడు అందరి ముందు ముద్దు పెట్టుకున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు కదా” అంటూ వధువు తరఫు బంధువులు చెప్తున్నారు..” నేను బలవంతంగా ఆమెకు ముద్దు పెట్టలేదు. ఆమె అంగీకారంతోనే అలా చేశాను.. ఇందులో నా తప్పేమీ లేదని” వరుడు పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మరోవైపు ప్రజా జీవనానికి భంగం కలిగించారని అభియోగాలు మోపుతూ.. పోలీసులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.