Vakiti Srinivasulu: మనుషుల్లో రోజురోజుకు సహనం అనేది నశించి పోతోంది. ఓపిక అనేది మాయమవుతోంది. సాటి మనిషి పై సానుభూతి అనేది కరువు అవుతోంది. చిన్న చిన్న విషయాలకే పంతాలకు పోవడం, కోపాలను పెంచుకోవడం, పట్టరాని ఆగ్రహంతో దారుణాలకు పాల్పడడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లోని హోసూరు ప్రాంతంలో జరిగింది. ఈ గ్రామంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుడు వాకిటి శ్రీనివాసులు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ సాగించగా.. విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
అదే కారణం
హోసూరు గ్రామానికి చెందిన గుడిసె నరసింహులు సిఆర్పిఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేశాడు. 2020లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాడు. ఆ తర్వాత సొంత గ్రామానికి వచ్చాడు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీలో చేరాడు. గ్రామస్థాయిలో నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు దగ్గర తన పరపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వాకిటి శ్రీనివాసులతో నరసింహులు కు విభేదాలు మొదలయ్యాయి. కొన్ని నెలల క్రితం ఒక విషయంలో నర్సింహులు, శ్రీనివాసులు గొడవపడ్డారు. ఇద్దరు పరస్పరం దూషించుకున్నారు. దీంతో శ్రీనివాసులు పట్టరాని ఆగ్రహంతో తన చెప్పు తీసుకొని నర్సింహులు చెంప మీద కొట్టాడు. ఇక అప్పటినుంచి నర్సింహులు శ్రీనివాసులపై కోపాన్ని పెంచుకున్నాడు. ఇదే క్రమంలో పత్తికొండ ప్రాథమిక వ్యవసాయ సహకారం పరపతి సంఘం చైర్మన్ పదవి శ్రీనివాసులకు ఇస్తారని ఆ గ్రామంలో ప్రచారం జరిగింది. అతడికి ఆ పదవి ఇస్తే రాజకీయంగా తనకు ఇబ్బంది అని నరసింహులు భావించాడు. ఎలాగైనా సరే శ్రీనివాసులను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తనకు బాగా దగ్గరైన నలుగురు వ్యక్తులతో పంచుకున్నాడు. ఆ తర్వాత వారు శ్రీనివాసులు హత్యకు పథకాన్ని రచించారు.
బహిర్భూమికి వెళ్లిన తర్వాత..
గత బుధవారం శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్ళాడు. అప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో మాటువేసి ఉన్న వారు ఒక్కసారిగా శ్రీనివాసులు మీద పడ్డారు. తమ వెంట తెచ్చుకున్న బలమైన ఇనుప రాడ్డుతో గట్టిగా కొట్టారు. తలమీద బలంగా మోదడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కీలకమైన ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో శ్రీనివాసులతో విభేదాలు ఉన్న వారిని విచారించారు. అందులో నరసింహులు భయపడుతూ సమాధానం చెప్పడం, పొంతన లేకుండా మాట్లాడటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు తమదైన చర్యలు విచారించగా.. ఈ కేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండడం గమనార్హం.