Prakasam District: ఆ వీడియో చూసిన తర్వాత రక్తం మరిగిపోతోంది. అలా కొడుతున్న వాడిని చూసి ఏదైనా చేయాలి అనిపిస్తుంది. వాడు గనక దొరికితే.. కచ్చితంగా అలానే కొట్టాలి అనిపిస్తుంది. పాపం ఆ మహిళ ఎంత ఇబ్బంది పడిందో. వాడు అలా కొడుతుంటే ఎంత ఆవేదన చెందిందో.. ఆమె శరీరం ఎంతగా గాయపడిందో.. రెండు చేతులను రెండు కర్రలకు కట్టేసి.. తాడుతో గొడ్డును బాదినట్టు బాదుతుంటే.. ఆమె పెట్టిన ఆర్తనాదాలు గుండెను కదిలించాయి. హృదయాన్ని ద్రవింపజేశాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆ ఇల్లాలు పెడుతున్న కన్నీళ్లకు మనసు కకావికలం అయిపోతుంది.
మొదట్లో ఆ వీడియోని చూసి కృత్రిమ మేధ ద్వారా రూపొందించిందని అనుకున్నాం. కానీ ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది నిజంగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం కలు జువ్వలపాడు గ్రామంలో గురునాథం అనే వ్యక్తికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.. భార్య ఉండగానే మరో మహిళతో అతడు సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆ మహిళను తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. భార్యాపిల్లలను వదిలిపెట్టి ఆమెతో కలిసి ఉంటున్నాడు. భర్త వదిలి వెళ్లిపోవడంతో గురునాథం భార్య తన నలుగురు పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. ఓ బేకరీలో పని చేస్తూ వారిని సాకుతోంది. అయితే గురునాథం మద్యానికి అలవాటు పడి అప్పుడప్పుడు స్వగ్రామానికి వస్తుంటాడు. బేకరీలో పని చేసే తన భార్యను డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పడుతుంటాడు. ఆమె దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఇటీవల కూడా గురునాథం స్వగ్రామానికి వచ్చాడు. తన భార్యను డబ్బుల కోసం వేధించాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో.. ఇలా కర్రలకు కట్టేసి అత్యంత కిరాతంగా కొట్టాడు. అతని మోకాలు తో వెన్నుభాగాన్ని పదేపదే గుద్దాడు. ఆ బాధలకు తట్టుకోలేక ఆమె తీవ్రంగా విలపించింది. గురునాథం పైశాచికత్వాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో ద్వారా గురునాథం పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రకాశం జిల్లా పోలీసులు దాకా వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు కేసు నమోదు కాలేదని సమాచారం. గురునాథం దారుణంగా కొట్టడంతో అతని భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించారని స్థానికుల ద్వారా తెలుస్తోంది. అయితే గురునాథం మొదటి నుంచి కూడా ఇలానే వ్యవహరించే వాడని.. ఆమెను తీవ్రంగా కొట్టేవాడని.. చివరికి వేరే మహిళతో సంబంధం పెట్టుకొని హైదరాబాద్ వెళ్లిపోయాడని.. హైదరాబాద్ వెళ్ళినప్పటికీ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి ఇలా భార్యను తీవ్రంగా కొడుతూ ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. అతనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
View this post on Instagram