https://oktelugu.com/

Crime News : మరో 10 రోజుల్లో షాదీ.. ఇంతలోనే దారుణం..

ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. కొద్దిరోజుల్లో పెళ్లి ఉండగా, పెళ్ళికొడుకుతో సహా ఐదుగురు చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 18, 2024 / 08:25 PM IST

    crime news

    Follow us on

    Crime News : మరో 10 రోజుల్లో పెళ్లి.. ఇళ్లంతా హడావిడిగా ఉంది. బంధువుల రాకతో సందడిగా మారింది. ఈ క్రమంలో పెళ్లికి అవసరమైన దుస్తులను కొనుగోలు చేసేందుకు వారంతా హైదరాబాద్ వెళ్లారు. నచ్చిన దుస్తులు కొనుగోలు చేసి, కారులో తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. అప్పటిదాకా సరదాగా మాట్లాడుకున్నవారు.. ఒక్కసారిగా జరిగిన ఘటనతో హతాశులయ్యారు. అయినవాళ్లు విగత జీవులుగా పడి ఉంటే హాహాకారాలు చేశారు. ఈ హృదయ విదారక సంఘటన అనంతపురం జిల్లా జాతీయ రహదారి దగ్గర జరిగింది.

    అనంతపురం జిల్లా రాణి నగర్ ప్రాంతానికి చెందిన ఏడుగురు తమ ఇంట్లో పెళ్లి ఉండడంతో.. దుస్తులు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ కు కారులో బయలుదేరారు. అక్కడ పెళ్లి దుస్తులు కొనుగోలు చేసి స్వగ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో గుత్తి కి నాలుగు కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. జాతీయ రహదారి పై డివైడర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ లారీ అదే కారును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

    ఈ రోడ్డు ప్రమాదంలో అల్లి సాహెబ్ (58), షేక్ సురోజ్ భాషా(28), మహమ్మద్ ఆయాన్ (6), మహమ్మద్ అమాన్ (4), రెహానా బేగం (40) మృతి చెందారు. మృతి చెందిన వారిలో షేక్ సురోజ్ భాషా వివాహం ఈనెల 27న జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వారంతా పెళ్లి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు పాతబస్తీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ షాపింగ్ మొత్తం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కొద్దిసేపట్లో స్వగ్రామానికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. కొద్దిరోజుల్లో పెళ్లి ఉండగా, పెళ్ళికొడుకుతో సహా ఐదుగురు చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.