Uttar Pradesh : చావు బతుకుల్లో భర్త.. అంబులెన్స్ లో తీసుకెళుతున్న భార్యపై డ్రైవర్ పాడు పని..

అక్రమాలకు, అన్యాయాలకు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి బుల్డోజర్ ప్రయోగిస్తున్నారు. ఇప్పటికి ఆ బుల్డోజర్ మార్క్ న్యాయం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు దీనిని ఓ అంబులెన్స్ డ్రైవర్ మీదికి ప్రయోగించాల్సిన అవసరం యోగి ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే జరిగిన దారుణం అటువంటిది కాబట్టి..

Written By: Anabothula Bhaskar, Updated On : September 5, 2024 9:20 pm

Crime News

Follow us on

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడిని బతికించుకునేందుకు ఆగస్టు 28న ఘాజీ పూర్ ప్రాంతంలోని ఆరావళి మార్క్ లోని ఆసుపత్రిలో చేర్పించింది. అక్కడ బిల్లు తట్టుకోలేక.. తన భర్తను ఇంటికి తీసుకెళ్తానని అక్కడి వైద్యులను కోరింది. దీంతో వారు ఫీజు మొత్తం వసూలు చేసి ఆమె భర్తను ఒక అంబులెన్సులో పడుకోబెట్టి.. అంబులెన్స్ డ్రైవర్ ను ఆమెతో పంపించారు. ఆ మహిళ తన సోదరుడి సహాయంతో సిద్ధార్థ నగర్ ప్రాంతంలోని తన ఇంటికి వెళ్ళింది. ప్రయాణం ప్రారంభించే క్రమంలో ఆ మహిళను తన పక్కన కూర్చోవాలని అంబులెన్స్ డ్రైవర్ కోరాడు. ముందు దానికి ఆమె ఒప్పుకోకపోయినప్పటికీ.. వాహనాన్ని పోలీసులు ఆపుతారని.. అందువల్లే మీరు ముందు కూర్చోవాలని ఆమెకు మరోసారి చెప్పాడు. దీంతో గత్యంతరం లేక ఆమె అతడి పక్కన కూర్చుంది. ఘాజీ పూర్ సిటీ దాటిన తర్వాత అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దానికి ఆ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో వారి ప్రవర్తనను గమనించిన ఆమె భర్త, సోదరుడు కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడు వారిని చవానీ పోలీస్ స్టేషన్ రోడ్ లో ఆ వాహనాన్ని ఆపారు. వారిని రోడ్డు పక్కన దించారు. ఆ బాధిత మహిళ భర్త ఆక్సిజన్ తొలగించారు. ఆమె వద్ద ఉన్న పదివేల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను లాక్కొని వెళ్లిపోయారు.

పోలీసులకు ఫిర్యాదు

అర్ధరాత్రి తమను రోడ్డు పక్కనే వదిలి వెళ్లిపోవడంతో తట్టుకోలేక ఆ మహిళ, ఆమె సోదరుడు 112, 108 నెంబర్లకు ఫోన్ చేసి పరిస్థితిని వెల్లడించారు. దీంతో పోలీసులు తక్షణమే స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆమె భర్తను మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ అక్కడ అతడి పరిస్థితి పూర్తిగా విషమించింది.. దీంతో గోరఖ్ పూర్ ప్రాంతంలోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తుండగానే అతడు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ బాధిత మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. దీనిపై ఘాజీ పూర్ ఏ డీసీపీ జితేంద్ర దూబే మాట్లాడారు..”బాధిత మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించాం. చనిపోయిన ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించాం. ఈ కేసులో ఇంకా వివరాలు సేకరించాల్సి ఉంది. సిసి పుటేజ్ ద్వారా అంబులెన్స్ డ్రైవర్ కదలికలు గమనించాం. సిద్ధార్థ నగర్ లోని ఆసుపత్రి నిర్వాహకుల వద్ద నుంచి అంబులెన్స్ డ్రైవర్ వివరాలు సేకరించాం. ఈ కేసు సంబంధించి త్వరలోనే మరింత లోతుగా విచారణ నిర్వహిస్తామని” ఏడీసీపీ పేర్కొన్నారు.