Guntur: అనైతికమైన సంబంధాలు ఎప్పటికైనా సరే ముప్పు తీసుకొస్తాయి. ఇటువంటి వ్యవహారాలు కుటుంబాలలో కూడా గొడవలకు కారణమవుతుంటాయి. అవి అంతిమంగా దారుణానికి దారితీస్తుంటాయి.. అటువంటిదే ఈ సంఘటన కూడా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో ఘోరం జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఆలకుంట మల్లేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లేష్ కు తెనాలిలోని సీఎం కాలనీలో ఉంటున్న కొల్లా దుర్గ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దుర్గకు గతంలోని పెళ్లయింది. భర్తతో విభేదాల వల్ల కుమారుడితో కలిసి సీఎం కాలనీలో నివాసం ఉంటున్నది. మల్లేష్ ఆరు సంవత్సరాలుగా దుర్గ తో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు.
కొద్దిరోజులుగా దుర్గకు, మల్లేష్ కు విభేదాలు మొదలయ్యాయి. ఇవి కాస్త కుటుంబ గొడవల దాకా వెళ్లాయి. దుర్గ, మల్లేష్ పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దుర్గ, మల్లేష్ మరోసారి గొడవపడ్డారు. ఈసారి ఇరువైపులా కుటుంబ సభ్యులు ఈ వివాదంలో రంగ ప్రవేశం చేశారు. ఆవేశంలో దుర్గ, మల్లేష్ భార్య పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. ఈ ప్రమాదంలో మల్లేష్ భార్య, దుర్గ, 9 మంది గాయపడ్డారు. దుర్గకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.
మరోవైపు దుర్గ మరణం పట్ల ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కుమార్తెను అకారణంగా చంపేశారని ఆరోపిస్తోంది. తన దగ్గర డబ్బులు మొత్తం తీసుకొని.. తిరిగి అడిగితే మల్లేష్, అతని భార్య ఇంతటి దారుణానికి పాల్పడ్డారని దుర్గ తల్లి ఆరోపిస్తోంది. తమ కుమార్తె మరణం పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పట్టించుకోవడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. దుర్గ మీద పెట్రోల్ పోసి, నిప్పు అంటించి దారుణంగా చంపేశారని దుర్గ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. అటు తండ్రి దూరం కావడం.. తల్లి చనిపోవడంతో ఆ బాలుడు అనాధగా మారిపోయాడు.