Stock Market Tragedy: క్షణిక ఆవేశం.. దీనివల్ల ఎంతటి అనర్ధాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది క్షణకాలంలో ఆవేశం వల్ల దారుణాతి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంతులేని శోకాన్ని మిగులుస్తాయి . ఈ ఘటన కూడా అటువంటిదే.
అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. గోలు గొండ మండలం.. కొంగ సిగి గ్రామం.. ఈ ప్రాంతానికి చెందిన అరిట ప్రసాద్ నేవీ విభాగంలో విశ్రాంత ఉద్యోగి. ఇతడికి 36 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. నేవీ నిబంధనల ప్రకారం అతడు ఇటీవల ఉద్యోగ విరమణ చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ ప్రయోజనాలు లభించాయి. ఈ క్రమంలో వచ్చిన డబ్బుతో షేర్లు కొనుగోలు చేశాడు. అందులో పూర్తిగా నష్టపోయాడు. నేవీ విభాగంలో 15 సంవత్సరాల పాటు పనిచేస్తే వచ్చిన డబ్బుతో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో నిండా మునిగిపోయాడు.
షేర్లు కొనుగోలు చేయడానికి అప్పులు కూడా చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో డబ్బులు ఇచ్చినవారు సూటిపోటి మాటలు అన్నారు. వాస్తవానికి షేర్ మార్కెట్లో అతడు పెట్టుబడి పెడుతున్న తీరు భార్యకు ఏమాత్రం నచ్చేది కాదు. అనేక సందర్భాలలో భర్తను వారించేది. ఈ నిర్ణయం సరి కాదని చెప్పేది. అయితే ఆమె నిర్ణయాన్ని భర్త పక్కన పెట్టాడు. అప్పులు ఇచ్చినవారు ఇంటి మీదికి రావడంతో భార్య లక్ష్మీపార్వతి భర్తను నిలదీసింది.
భర్త ఏమాత్రం మారడని అర్థం చేసుకున్న లక్ష్మీపార్వతి మనస్థాపానికి గురైంది. గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఉరివేసుకుంది. లక్ష్మీపార్వతి గది తలుపు తీయకపోవడంతో భయపడిన భర్త చుట్టుపక్కల వారిని పిలుచుకు వచ్చాడు. అందరి సహాయంతో తలుపు బలవంతంగా తెరిచాడు. అప్పటికే లక్ష్మీపార్వతి చనిపోయింది. లక్ష్మీపార్వతి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లక్ష్మీపార్వతి చెప్పినప్పుడు ఆమె భర్త గనుక విని ఉంటే ఇంతటి ఇబ్బంది ఆ కుటుంబానికి వచ్చేది కాదు. పైగా ఉన్న డబ్బులు మొత్తం షేర్ మార్కెట్లో పెట్టడంతో లక్ష్మీపార్వతి భవిష్యత్తు గురించి తీవ్రంగా బెంగ పడింది. ఏం చేయాలో తెలియక అనేక సందర్భాలలో భర్తను నిలదీసింది. అయినప్పటికీ అతడు మారలేదు. దీంతో గత్యంతరం లేక అంతటి కఠినమైన నిర్ణయం తీసుకుంది.