Golamari Krantikumar Reddy: అగ్రరాజ్యం అమెరికాకు ఎన్నో ఆశలతో వెళ్తున్న భారతీయులు అక్కడికి వెళ్లాక చాలా మంది సంతోషంగానే ఉంటున్నారు. అయితే వేర్వేరు కారణాలతో కొందరు విగత జీవులుగా తిరిగి వస్తున్నారు. కొందరు అమెరికన్న దాడులు, కాల్పుల్లో మరణిస్తుండగా, మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందుతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా మరో భారతీయుడు ప్రధానంగా తెలుగు యువకుడు అమెరికాలో మరణించాడు. సిద్దిపేట జిల్లా ఐనవోలు మండలం జగ్గయ్యగూడెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గోలమారి క్రాంతికుమార్‌రెడ్డి(35) అనారోగ్యంతో ఈనెల 17న డల్లాస్‌లో మరణించాడు. గొలమారి జోజిరెడ్డి,–లూత్‌మేరి దంపతుల కుమారుడు క్రాంతి అమెరికాలోనే చదువుకున్నాడు. అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు.
జ్వరంలో ఆస్పత్రికి..
క్రాంతికి ఇటీవల జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. జ్వరానికి చికిత్స పొందుతుండగానే ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురాయ్యాడు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో మృతిచెందాడు. క్రాంతికి మూడేళ్ల క్రితం తెలంగాణకు చెందిన ప్రియాంకతో వివాహమైంది. ఆమె కూడా సాఫ్‌టేవర్ ఇంజినీరే. వీరికి ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. క్రాంతి మెదక్ జిల్లా వర్గన్‌లోని నవోదయలో చదువుకున్నాడు. ఇక్కడ చదివిన చాలా మంది అమెరికాలో స్థిరప్డాడు.
స్వగ్రామానికి మృతదేహం..
మిత్రుడి మృతివార్త తెలుసుకున్న స్నేహితులు క్రాంతి మృతదేహాన్ని స్వగ్రామానికి చేరేలా సహకరించారు. గురువారం(డిసెంబర్ 26న) మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎదిగిన కొడుకు అకాల మరణంతో తల్లిదండ్రుల కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామంలోనూ విషాదం నెలకొంది.