Hyderabad: జీవితం అనేది నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఏ సమయంలో ఉద్భవిస్తుందో.. ఏ సమయంలో మాయమవుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే మనిషి జీవితానికి నిన్నటికి రూపులేదు.. నేటికీ నమ్మకం లేదు. రేపటికి భరోసా లేదు అంటారు. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ బాలుడి పరిస్థితి కూడా అదే. ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు.. ఎంతో అందమైన జీవితం ఉన్న అతడు.. అర్ధాంతరంగా తనువు చాలించాడు. అయితే ఆ ప్రమాదానికి కారకుడు అతడు కాదు. అతడి ప్రమేయం పరోక్షంగా కూడా లేదు. కానీ చూస్తుండగానే ప్రాణాలు విడిచాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగానే కన్నుమూశాడు. నీ హృదయ విదారక సంఘటన హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది. ఆ బాలుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
అది హైదరాబాద్ నగరంలోని పటాన్ చెరు ప్రాంతం. ఆ ప్రాంతం మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు వెళుతుంది. ప్రతిరోజు ఆ రోడ్డుపై వేలాదిగా వాహనాలు వెళ్తుంటాయి. ఉదయం నుంచి మొదలుపెడితే రాత్రి వరకు ఆ ప్రాంతం మొత్తం విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. భారీ కంటైనర్ ల నుంచి మొదలు పెడితే కార్ల వరకు ఆ మార్గం మీదుగా వెళుతుంటాయి. పెద్ద పెద్ద భవనాలు, పచ్చని చెట్లతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతం ఆహ్లాదంగా కనిపిస్తుంది. అయితే ఈ రింగ్ రోడ్డు పై ఓ బాలుడు(6) మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ టైరు దొర్లుకుంటూ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ టైరు ఆ బాలుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.. గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు..
టైరు ఢీకొనడంతో గాయపడిన బాలుడు పేరు మోక్షిత్ రెడ్డి. అతడి తండ్రి పేరు సందీప్ రెడ్డి. వీరిది అమీన్పూర్ మండలం పటేల్ గూడ. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరంలో పనిమీద వెళ్లారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ముత్తంగి దాబా వద్ద భోజనం చేసేందుకు దిగారు. భోజనం చేసిన తర్వాత సుల్తాన్పూర్ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కారు. ఈ క్రమంలో మోక్షిత్ రెడ్డి తనకు మూత్రం వస్తోందని చెప్పడంతో.. సందీప్ రెడ్డి కారును పక్కకు ఆపాడు. అనంతరం ఆ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఓ వాహనం టైరు వేగంగా దొర్లుకుంటూ వచ్చింది. మోక్షిత్ రెడ్డికి బలంగా తగిలింది. దీంతో మోక్షిత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. రక్త స్రావం కూడా అధికంగా అయింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ముత్తంగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నగరంలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం కన్నుమూశాడు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అమీన్పూర్ ఎస్సై సోమేశ్వరి తన సిబ్బందితో కలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు. వారి పరిశీలనలో టైరు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియ రాలేదు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళుతున్న వాహనం టైరు ఊడిపోయి మోక్షిత్ రెడ్డిని తగిలి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు.. టైరు ఊడిపోయి బాలుడికి తగలడంతో.. అతడు తీవ్రంగా గాయపడ్డాడని, సున్నితమైన భాగాలలో దెబ్బలు తగలడంతో బాలుడు చనిపోయాడని పోలీసులు అంటున్నారు. కాగా, మోక్షిత్ రెడ్డి టైరు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కంటికి ధారగా విలపిస్తున్నారు. చూస్తుండగానే తమ కొడుకును టైరు ఢీ కొట్టిందని, అది తగిలిన తీవ్రతకు గాయాలయ్యాయని, రక్త స్రావం కూడా అధికంగా అయిందని, అందువల్లే చనిపోయాడని మోక్షిత్ రెడ్డి తండ్రి సందీప్ రెడ్డి చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More