Secret Camera Issue: రాత్రికి రాత్రి నిదితురాలిని తప్పించారు.. ఎవరు చేశారు? సూత్రధారులు ఎవరు?

ఇంజనీరింగ్ కాలేజీలో బాలికల వసతి గృహంలో సీక్రెట్ కెమెరాల ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంటోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిందితులను స్వయంగా ప్రభుత్వమే కాపాడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : August 31, 2024 11:52 am

Secret Camera Issue

Follow us on

Secret Camera Issue: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందా? హిడెన్ కెమెరాలను అమర్చిన నిందితురాలిని సేఫ్ జోన్ లో చేర్చరా? అదంతా ప్రభుత్వ ఆదేశాలతో జరిగిందా? హాస్టల్ నుంచి రాచ మర్యాదలతో కారులో ఆమెను తరలించారు? ఇదంతా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే జరిగిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. ఓ షాకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. హాస్టల్లో విద్యార్థులంతా ఉండగానే పోలీసులు హడావిడిగా వచ్చి ఓ యువతిని కారుపై తీసుకెళ్లారు. యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వమే ఈ ఎత్తుగడ వేసింది అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని బాలికల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో 300 మంది విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్ వెలుగులతో నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. తెల్లవారుజాము మూడు గంటల వరకు ఈ నిరసనలను కొనసాగించారు. దీంతో ఇది ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. బాధితుడిగా అనుమానిస్తున్న ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన లాప్టాప్ తో పాటు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ విద్యార్థికి ఇద్దరు విద్యార్థినులు సహకరించారన్నది ఆరోపణ. కేవలం బాయ్ ఫ్రెండ్స్ కోసమే ఆ ఇద్దరు బాలికలు ఈ చర్యకు దిగారని తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరిలో ఒకరిని హుటాహుటిన ఒక కారులో తీసుకెళ్లి పోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. దీనిపై రకరకాల అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

* రాజకీయ రంగు
ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. రాజకీయ ప్రత్యర్థులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ఈవీఎం ప్రభుత్వమే దీనిని నడిపిస్తోందని.. ఈవీఎం సీఎం ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నది ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం. అనుమానితురాలైన విద్యార్థినిని పోలీస్ అధికారులు ఓ కారులో తరలిస్తున్న ఫోటోను, వీడియోను జతచేస్తూ.. ఈవీఎం సీఎం ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని.. టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ మీమ్స్ ను జత చేస్తూ ప్రచారం ప్రారంభించారు.

* వెంటనే స్పందించిన సీఎం
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర తో పాటు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో మంత్రి లోకేష్ సైతం స్పందించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.

* సోషల్ మీడియాలో రచ్చ
అయితే వారం రోజుల కిందటే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయినా యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. దీంతోనే రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కాలేజీ యాజమాన్యానికి రాజకీయంగా పలుకుబడి ఉంది. మరోవైపు సీక్రెట్ కెమెరాలు అమర్చిన విద్యార్థినికి సైతం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమెతో పాటు కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నది ప్రధాన ఆరోపణ. ఇది రాజకీయ రంగు పులుముకోవడంతోనే వైసిపి ప్రచారం చేస్తోందని టిడిపి అనుమానిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆ రెండు పార్టీల మధ్య రచ్చ నడుస్తోంది.