Road Accident: వారంతా వ్యవసాయ కూలీలు. పనులు ముగించుకొని ఆటో పై ఇంటికి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఇంటికి వెళ్తామనుకున్న తరుణంలో.. ఆర్టీసీ రూపంలో కబళించింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు.రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే స్పందించింది. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసు పల్లెలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలు రోజంతా పనిచేశారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఆటోను ఆశ్రయించారు. ఆటోలో వెళుతుండగా ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
* పరిహారం ప్రకటించిన సీఎం
అనంతపురం జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యవసాయ కార్మికులు మృత్యువాత పడడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లి వస్తున్న వారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో మృతిని కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
* పోలీస్ శాఖ అలెర్ట్
ఈ ఆటో ప్రమాదం పై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొని ఏడుగురు చనిపోవడం బాధాకరమన్నారు. గాయపడిన ఆరుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.