BGT 2024: 297 బంతులను యశస్వి జైస్వాల్ ఎదుర్కొన్నాడు. తన సహజ శైలికి భిన్నంగా ఆడాడు. దూకుడు తగ్గించి డిఫెన్స్ మోడ్ ను ప్రదర్శించాడు. ఇలా తనను తాను ఆవిష్కరించుకోవడానికి జైస్వాల్ ఎంతో కష్టపడ్డాడు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత థానే మైదానంలో కఠోరమైన ప్రాక్టీస్ చేశాడు. సీసీ రోడ్డు కంటే దృఢంగా ఉన్న మైదానంపై అతడు శిక్షణ సాగించాడు. 145 కిలోమీటర్ల కంటే వేగవంతమైన బంతులను ఎదుర్కొంటూ రాటు తేలాడు. వైవిధ్యమైన బంతులు వేయించుకుంటూ కొత్త క్రికెట్ ఆడాడు. అయితే అది తొలి ఇన్నింగ్స్ లో విజయవంతం కాకపోయినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా పనిచేసింది. అందువల్లే అతడు రోజు మొత్తం క్రీజ్ లో ఉండగలిగాడు. ధాటిగా బ్యాటింగ్ చేయగలిగాడు. ధీటుగా పరుగులు చేయగలిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించగలిగాడు. ఒకానొక దశలో డబుల్ సెంచరీ వైపు యశస్వి కదిలాడు. అయితే అనూహ్యంగా 161 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడు గనుక అలానే ఆడి ఉంటే టీమిండియా స్కోర్ మరో తీరుగా ఉండేది.. యశస్వి ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొంటూ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తో కలిసి తొలి వికెట్ కు ఏకంగా 201 పరుగులు జోడించాడు. అయితే సంచలనమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్… ప్రపంచ రికార్డును సృష్టించాడు. గొప్ప గొప్ప ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు.
2014 తర్వాత
టెస్ట్ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు జైస్వాల్ 34 సిక్స్ లు కొట్టాడు. అతనికంటే ముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగజా ఆటగాడు మెక్కల్లమ్ పేరు మీద ఉండేది. అతడు 2014లో ఏకంగా టెస్టులలో 33 సిక్స్ లు కొట్టాడు. అయితే అతని రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 34 సిక్స్ లను జైస్వాల్ కొట్టాడు. మెకల్లమ్ రికార్డును కాలగర్భంలో కలిపేశాడు. ఆస్ట్రేలియా బౌలర్ లయన్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టి ఈ రికార్డును జైస్వాల్ తన పేరు మీద రాసుకున్నాడు. జైస్వాల్ తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(26) ఉన్నాడు. అయితే ఈ ఏడాది సెంచరీల పరంగా కూడా జైస్వాల్ ముందున్నాడు. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాడిగా జైస్వాల్ మరో రికార్డ్ కూడా సృష్టించాడు. జైస్వాల్ అద్భుతమైన సెంచరీ చేసిన నేపథ్యంలో అతనిపై సోషల్ మీడియాలో అభినందనలు కురుస్తోంది.. అభిమానులు అతడి ఆట తీరును పదేపదే కొనియాడుతున్నారు. గొప్ప ప్రదర్శన చేశాడని కితాబిస్తున్నారు. టీమ్ ఇండియాను ఆస్ట్రేలియాపై పైచేయి సాధించేలా చేశాడని ప్రశంసిస్తున్నారు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత టీమిండియా కు బిగ్ రిలీఫ్ దక్కిందంటే దానికి కారణం జైస్వాల్ అని పేర్కొంటున్నారు.