Rental Cars Fraud: “సార్ మాది పెద్ద కంపెనీ. ఉద్యోగులను ఆఫీసులోకి తీసుకెళ్లి.. తోలి రావడానికి కారు కావాలి. ఎలాంటి మోడల్ అయినా పర్వాలేదు.. రెంట్ మీరు ఎంత అడిగితే అంత ఇస్తాం. మాది చాలా పెద్ద కంపెనీ. వాహనాలను కొనుగోలు తీసే సామర్థ్యం మాకుంది. కాకపోతే మీలాంటి వాళ్లకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతోనే మా మేనేజ్మెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది” ఇటువంటి కాల్స్ గనుక వస్తే కచ్చితంగా స్పందించొద్దు. పొరపాటున కూడా కారు వారికి ఇవ్వద్దు. ఎందుకంటే?
హైదరాబాద్ నగరంలో బాడుగ విధానంలో కార్లను ఇస్తుంటారు. ఇది కొత్తది కాకపోయినప్పటికీ.. దీని వెనక నిండా ముంచేసే మోసం ఉంది. కార్ల యజమానులను బికారులను చేసే పన్నాగం ఉంది. ఎందుకంటే పోలీసుల విచారణలో ఓ మహిళ, మరో వ్యక్తి చేస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు వాళ్లు 21 మందికి చేసిన మోసం బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ ఘటనలో పోలీసులు ఒక మహిళను, ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 2.5 కోట్ల విలువచేసే కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలోని టెలికాం నగరంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది..
ఎలా మోసం చేశారంటే
గచ్చిబౌలి ప్రాంతంలో టెలికాం నగరంలో జూపూడి ఉష తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఈమె భర్త గతంలో ఐఐటి ఖరగ్ పూర్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేసేవాడు. ఒకరోజు విధుల్లో ఉండగా తేనెటీగలు అతనిపై దాడి చేశాయి. అవి తీవ్రంగా కొట్టడంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. అతడు చికిత్స కోసం ఉష దాదాపు కోటి వరకు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ అతడు బతకలేదు. భర్త చనిపోవడం.. అతడి చికిత్స కోసం తీసుకొచ్చిన అప్పులు పెరిగిపోవడంతో ఉషలో ఆందోళన పెరిగిపోయింది. ఇదే సమయంలో తన వద్ద ఉన్న కారును సెల్ఫ్ డ్రైవ్ కు ఇచ్చేసింది. అలా కారు సెల్ఫ్ డ్రైవ్ కు ఇస్తున్న సమయంలో తుడుముల మల్లేష్ అనే వ్యక్తితో ఉషకు పరిచయం ఏర్పడింది. సెల్ఫ్ డ్రైవ్ కు తన కారు ఇవ్వడం ద్వారా ఉషకు దండిగా ఆదాయం వచ్చింది. ఇదేదో బాగుందనుకొని మల్లేష్ సహాయంతో ఉష దందాకు తెర లేపింది. మల్లేష్ ద్వారా కార్ల యజమానులకు ఉష ఫోన్ చేయించేది. ” మాది అతిపెద్ద కంపెనీ. ఉద్యోగులను తీసుకురావడానికి మీ కార్లు అద్దెకు కావాలి. ప్రతినెల అద్దె చెల్లిస్తామని” మల్లేష్ చెప్పేవాడు. అతని మాటలకు ఆకర్షితులై 21 మంది తమ కార్లను అప్పగించారు. వాటిని తీసుకున్న ఉష, మల్లేష్.. ఇతర మార్గాల వైపు మళ్ళించారు.
కర్ణాటకకు తరలించి.. ఆ తర్వాత ఏం చేశారంటే..
అలా కార్లను తీసుకున్న ఉష, మల్లేష్ కర్ణాటకలో సాగర్, పాటిల్, అనిల్ కుమార్ అనే వ్యక్తులకు ఇచ్చారు. వారు ఆ కార్లకు ఉన్న నంబర్ ప్లేట్లను తొలగించారు. ఆర్సీ నెంబర్లను మార్చారు. బీదర్, బల్కి జిల్లాలతో కొత్తగా ఆర్సి నెంబర్లు తీసుకున్నారు. నంబర్ ప్లేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ కార్లను మహారాష్ట్రకు తరలించి అక్కడ అద్దెకు ఇస్తున్నారు. ఇలా ఆదాయం భారీగా రావడంతో ఉష కేవలం 7 నెలల వ్యవధిలోనే 50 లక్షల వరకు అప్పులు తీర్చింది.. మిగతా డబ్బును మల్లేష్ ఇచ్చింది. మల్లేష్ ఆ డబ్బుతో ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే కార్లు ఇచ్చిన యజమానులు అద్దె కోసం ఉష, మల్లేష్ కు ఫోన్ చేయడంతో.. కల్లబొల్లి కబుర్లు చెప్పారు. వాళ్లు ఒత్తిడి తీసుకురావడంతో సిమ్ కార్డులు మార్చారు. తమ మకాం వేరేచోటకు పెట్టారు. అయితే రాయదుర్గం ప్రాంతానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఉష, మల్లేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉష, మల్లేష్ ను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కర్ణాటక వెళ్లి సాగర్, అనిల్ ను తమదైన శైలిలో విచారించి మహారాష్ట్ర నుంచి 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఆ వాహనాల విలువ 2.50 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అయితే తమ వాహనాల ఆర్సీ నెంబర్లు మార్చటం, తెలంగాణ పేరు మీద ఉన్న ప్లేట్లను తొలగించడంతో.. ఆ కార్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇంతటి దారుణానికి ఉష, మల్లేష్ కారణం కాబట్టి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆర్ సి, ఆ నంబర్ ప్లేట్లు తిరిగి ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.