Crime News : రూ.300 కోట్లు కొట్టేశాడు.. యూపీలో సాధువయ్యాడు.. ఈ పైసలన్నీ ఏం చేశాడు.?

మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాకి చెందిన బబ్బన్ విశ్వనాథ్ షిండే యూపీలోని మధురలోని బృందావనంలో సాధువుగా చెలామణి అవుతున్న విషయం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు అతన్ని వలపన్ని పట్టుకున్నారు. రూ.300 కోట్ల డిపాజిటర్ల ధనంతో ఉడాయించిన బబ్బన్ విశ్వనాథ్ షిండేపై మహారాష్ట్రలో పలుకేసులు నమోదయ్యాయి

Written By: Bhaskar, Updated On : September 29, 2024 12:37 pm

Crime News

Follow us on

Crime News :  సాధువుగా మారు వేషం కట్టి తప్పించుకు తిరుగుతున్న ఒక ఘరానా కేటుగాడిని మహారాష్ట్ర పోలీసులు పట్టుకొని కటకటాల వెనక్కి తోశారు. మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాకి చెందిన బబ్బన్ విశ్వనాథ్ షిండే యూపీలోని మధురలోని బృందావనంలో సాధువుగా చెలామణి అవుతున్న విషయం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు అతన్ని వలపన్ని పట్టుకున్నారు. రూ.300 కోట్ల డిపాజిటర్ల ధనంతో ఉడాయించిన బబ్బన్ విశ్వనాథ్ షిండేపై మహారాష్ట్రలో పలుకేసులు నమోదయ్యాయి.

బ్యాంక్ పెట్టి అధిక వడ్డీ ఆశ చూపి రూ.300 కోట్లు చేతబట్టి :
ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న బబ్బన్ విశ్వనాథ్ షిండే మహారాష్ట్రలోని బీడ్ పట్టణంలో జిజావూ మాసాహెహెబ్ మాల్టీ స్టేట్ బ్యాంక్ నెలకొల్పారు. తమ బ్యాంకులో డిపాజిట్లు చేస్తే ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని నమ్మించాడు. బీడ్, ధారాశివ్ జిల్లాల్లో ఖాతాదారుల నుంచి డిపాజిట్లు సేకరించాడు. సుమారు రూ.300 కోట్ల మేర డిపాజిట్లు అయ్యాక ఒక రాత్రి ఆ నగదుతో పరారయ్యాడు. విషయం తెలిసి దాదాపు రెండు వేల మంది డిపాజిటర్లు లబోదిబోమని ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాధువుగా వేషం కట్టి, ఉన్నచోట ఉండకుండా దేశ పర్యటన:
రూ.300 కోట్ల డబ్బుని చేతబట్టి మహారాష్ట్ర దాటిన షిండే మొదటగా ఆడబ్బుతో తన పేరున, తన కుటుంబీకుల పేరున ఆస్తులు సమకూర్చుకున్నాడు. పోలీసులకు దొరక్కుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సాధువుగా వేషం కట్టాడు. ఒకే ప్రాంతంలో ఉండకుండా సాధువు రూపంలోనే ఢిల్లీ, అసోం తో పాటు నేపాల్ దేశంలో పర్యటించాడు. మఠాలలో స్వామిజీలని కలుస్తూ తానూ సాధువుగా చెలామణీ అయ్యాడు. ఒకవైపు పోలీసుల కన్నుగప్పి ఈయన తప్పించుకుతిరుగుతుంటే మహారాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గట్టి నిఘాతో ఈయన్ని వెంబడిస్తూ వచ్చారు. చివరకు ఈయన యూపీలోని మధురలో ఉన్న కృష్ణబలరామ ఆలయ బృందావనంలో మకాం వేసిన విషయం గుర్తించారు. యూపీ పోలీసులతో కలిసి స్పెషల్ ఆపరేషన్ చేపట్టి దొంగ సాధువు బబ్బన్ విశ్వనాథ్ షిండే ని అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో తేలనున్న సొత్తు : ప్రజల నుంచి కొల్లగొట్టిన రూ.300 కోట్లను ఎక్కడెక్కడ దాచాడు..? ఏమేం ఆస్తులు సమకూర్చుకున్నాడు..? అనే విషయాలన్నింటినీ రాబట్టడానికి మహారాష్ర్ట పోలీసులు ప్రత్యేక విచారణ చేపట్టనున్నారు.