Punjab AAP MLA Harmeet Singh: కొన్నిటి గురించి ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. సెన్సార్ గిన్సార్ అంటూ లెక్కలు వేసుకోకూడదు. ఎందుకంటే మన కాలికే సెప్టిక్ అయితే ఉన్న ప్రాంతం వరకు తొలగించుకుంటాం. లేకపోతే బాడీ మొత్తం వ్యాపించి చనిపోతాం. అందుకే చెడు ఎక్కడ ఉన్న ప్రమాదమే. ఏ రూపంలో ఉన్న ప్రమాదమే. రాజకీయ వ్యవస్థలో చెడు అసలు ఉండకూడదు. ఎందుకంటే మన దేశాన్ని నడిపించేది.. రాజకీయమే కాబట్టి.
ఉన్నత విలువలు పాటిస్తాం.. గొప్పగా పరిపాలిస్తామని పంజాబ్లో అధికారంలోకి వచ్చింది చీపురు పార్టీ. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేసేది మాత్రం ముమ్మాటికి లంగా పనులు.. అటువంటి పని చేసిన ఓ ఎమ్మెల్యే తానేదో ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోయాడు. అంతేకాదు ఏకంగా పోలీసుల మీదకే కాల్పులు జరిపాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఎదురైన పరాభవం సరిపోదన్నట్టుగా పంజాబ్లో చీపురు పార్టీ నిర్లజ్జగా వ్యవహరిస్తోంది. మాదకద్రవ్యాలు.. పనికిమాలిన వ్యవహారాలు సరిపోవని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా నేరాలలో పాల్పంచుకుంటున్నారు. నేరమయ కార్యకలాపాలలో ముందు వరుసలో ఉంటున్నారు. ఇది తప్పు.. సమాజానికి ముప్పు అని పోలీసులు చెబుతున్నా కూడా వినిపించుకోవడం లేదు . చివరికి పోలీసుల మీదనే కాల్పులకు తెగబడుతున్నారు.
పంజాబ్ లోని సానౌర్ అనే పేరుతో ఒక నియోజకవర్గం ఉంది. ఇక్కడ చీపురు పార్టీ గుర్తుతో హర్మీత్ సింగ్ అనే వ్యక్తి గెలిచాడు. ఇటీవల అతడు అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. దీంతో అక్కడి రక్షకభటులు స్టేషన్ కు తీసుకెళ్లారు. చేసింది తప్పు.. పైగా చట్టం ముందు తలవంచుకొని ఉండాల్సింది పోయి.. తన అధికార దర్పం ప్రదర్శించాడు. తన అనుచరులతో కలిసి పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాదు ఆ ఎమ్మెల్యే పారిపోయే క్రమంలో ఒక పోలీసు అధికారిని వాహనంతో గుద్దినట్టు తెలుస్తోంది. ఆ శాసనసభ సభ్యుడు కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు.. ఆచూకీ లభిస్తే మళ్లీ అదుపులోకి తీసుకుంటారు.
ఈ ఘటనపై పంజాబ్ బిజెపి తీవ్రస్థాయిలో మండిపడుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులకు అధికారం ఇస్తే పరిస్థితి ఇదిగో ఇలానే ఉంటుందని చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శాంతిభద్రతలను పరిరక్షించిన వ్యక్తులు అధికారంలో ఉండడం ఏ మాత్రం సమంజసం కాదని అంటోంది. దీనిపై ఇంతవరకు పంజాబ్ ముఖ్యమంత్రి నోరు మెదపలేదు. చీపురు పార్టీ అధిపతి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.