Mobile Recovery: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ఇవ్వాలంటూ గుంటూరు పోలీసులు కోరగా ఆయన తిరస్కరించారు. ఈ విషయం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను ఏ-120గా చేర్చారు పోలీసులు. రామకృష్ణా రెడ్డి విచారణ అనంతరం మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. ‘సజ్జలను విచారించడం పూర్తయ్యింది. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఫోన్ ఇవ్వాలని ఆయనను కోరాం.. ఆయన మాత్రం దానికి స్పందించలేదు’ అని పోలీసులు చెప్పారు. ఇది పక్కన పెడితే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నాయకురాలు కవిత ఫోన్లను ఈడీ తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కూడా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ ఆధారంగా లొకేషన్, అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్ కాల్స్ గుర్తించినట్లు 2023, ఫిబ్రవరిలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో సీబీఐ ధర్మాసనానికి వివరించింది. వీటిని పరిశీలిస్తే పోలీసులు ఎలాంటి సందర్భాల్లో నిందితుల నుంచి ఫోన్లు తీసుకుంటారు. కేసు విచారణలో ఫోన్ సమాచారం ఏ మేరకు కీలకం? ఫోన్ తీసుకొని ఏయే అంశాలపై విచారణ చేస్తారు..? ఆ విషయాలను తెలుసుకుందాం.
ఫోన్ తో లభించే సమాచారం..
ప్రస్తుతం కాలంలో ఫోన్ అనేది బాడీలో ఒక పార్టుగా మారిపోయింది. బయటకు వెళ్తామంటే ఫోన్ ఉంటే చాలు. ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. దీంతో నేర విచారణలో ఫోన్ అనేది కీ రోల్ గా మారుతోంది. అందుకే పోలీసులు నిందితుల నుంచి తప్పకుండా ఫోన్ ను తీసుకుంటున్నారు. ‘మొబైల్ ఫోన్ ద్వారా తీసుకున్న సమాచారం ఆధారంగా విచారణ ఇంకా స్పీడ్ గా జరుగుతుంది. గతంలోనూ సుప్రీంకోర్టు కూడా మొబైల్ ఫోన్ ఆధారంగా విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో వీలు కల్పించింది’ అని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
మొబైల్ నుంచి ఏఏ సమాచారం తెలుసుకోవచ్చు..
ఫోన్‌లోని సమాచారం విశ్లేషించి కాల్ డేటా, లొకేషన్, వాట్సప్ చాట్, ఎస్ఎంఎస్ వివరాలు తెలుసుకునే వీలుంటుంది. కేసుల విచారణలో పోలీసులు ఫోన్ అడగడం వెనుక చాలా కారణాలుంటాయని ఒక సైబర్ నిపుణుడు తెలిపారు. ‘నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఎవరికీ కాల్ చేస్తున్నాడు..? ఎంత సేపు మాట్లాడాడు.? సోషల్ మీడియా గ్రూప్ లో ఉన్నాడా..? గ్రూపులో సభ్యులు ఎవరు..? ఇలాంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఫోన్ ఎవరికి చేశారో తెలుసుకోవడం సులభమే కానీ ఎవరికి చేశారనేది మాత్రం చెప్పలేము.
ఫోన్ ట్యాప్ చేసి ఉంటే ఏం మాట్లాడారో తెలుసుకోవచ్చు’ అని సైబర్ నిపుణులు తెలిపారు. ఫోన్ ట్యాప్ చేసేందుకు కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. ‘వాట్సాప్ కాల్‌కు సంబంధించి మెటా సంస్థ డేటా రిమూవ్ చేసినా కూడా గూగుల్ అకౌంట్‌లో వాట్సప్ బ్యాకప్ స్టోర్ అవుతుంది.’ అని శ్రీధర్ చెప్పారు.
ఆరు నెలల వివరాలు మాత్రమే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఆరు నెలల వరకు ప్రతీ ఒక్కరి కాల్ డేటా రికార్డింగ్ (సీడీఆర్) నిల్వ ఉంచాల్సిన బాధ్యత టెలికాం ఆపరేటర్లది. దీనికి సంబంధించి 2018 లోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఆరు నెలల్లోపు కాల్స్ విషయంలో సీడీఆర్ తీసుకునే వీలుంటుంది. ప్రభుత్వ లేదా న్యాయస్థానం ఆదేశాలుంటే తప్ప ఆరు నెలలు దాటి సీడీఆర్‌ను ఆపరేటర్లు నిర్వహించాల్సిన అవసరం లేదు. వాట్సప్, గూగుల్ టెక్ అవుట్ సర్వర్లలో చాలా కాలం నిల్వ ఉంటుంది. వాటి ద్వారా తెలుసుకోవచ్చు.’
తొలగించిన సమాచారం రాబట్టే వీలుందా?
నిందితుడి ఉద్దేశం ఏంటి..? నేరానికి సంబంధించి ఆధారాలు సేకరించవచ్చా..? అన్న కోణంలో ఫోన్లను తీసుకునేందుకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తారని ఎండ్ నౌ ఫౌండేషన్ చైర్మన్, సైబర్ నిపుణుడు ఒకరు తెలిపారు. ‘తొలగించినవి, క్లౌడ్ బ్యాకప్.. కోసం పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. వీటి ద్వారా నేరానికి సంబంధించి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా తొలగించిన సమాచారాన్ని పోలీసులు తీసుకునేందుకు వీలుంటుంది. నిందితుడి అనుమతి ఉంటే ఎక్కువ సమాచారం తీసుకునే అవకాశం ఉంటుంది. యాప్ లాక్, పాస్‌వర్డ్స్ చెప్పకపోతే తక్కువగా వివరాలు తీసుకునేందుకు వీలుంటుంది’ అని చెప్పారు.
‘ఎస్ఎంఎస్, కాంటాక్ట్ లిస్ట్, జీపీఎస్ అండ్ జీపీఎస్ లోకేషన్ హిస్టరీ, ఎంఎంఎస్, మెయిల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ, మల్టీ మీడియా ఫొటోలు, ఇంటర్నెట్ యాక్టివిటీ, యాప్స్ వివరాలు.. చాలా పద్ధతుల్లో సమాచారాన్ని పొందేందుకు వీలుంటుంది’ అని ఒకరు తెలిపారు.
వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా..?
అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి అతని అనుమతి లేకుండా ఫోన్ తీసుకునే వీలుండదు. వ్యక్తుల ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత)కి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫోన్ అనేది ఐటీ చట్టంలోని సెక్షన్ 43ఏ ప్రకారం వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుంది.
‘ఇప్పుడున్న టెక్నాలజీతో ఫోనే ఎక్కువ సమాచారం ఇస్తుంది. అందుకే వారి నుంచి ఫోన్లను తీసుకునేందుకు మొబైల్ ఇవ్వాలని నోటీసు ఇస్తాం. నేరాన్ని బట్టి సమాచారాన్ని తీసుకునేందుకు ఫోన్ ఉపయోగపడుతుంది. ఫోన్ ఇచ్చిన తర్వాత దాన్ని సీజ్ చేసి.. ముందుగా కోర్టుకు వివరిస్తారు. కోర్టు అనుమతి తీసుకొని అందులోని సమాచారం సేకరిస్తారు. కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ ల్యాబ్ సాయంతో ఫోన్‌లోని సమాచారం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mobile recovery do you know why the police take the phones of the accused after arrest
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com