Minor Girl News: నేటి కాలంలో దారుణాలు మితిమీరిపోతున్నాయి. జనాలలో పాపబీతి అనేది లేకుండా పోతోంది. ఇష్టానుసారంగా ప్రవర్తించడం.. అడ్డగోలుగా వ్యవహరించడం అనేవి సర్వ సాధారణంగా మారిపోతున్నాయి. ఇటువంటి దారుణాలు రోజుకు ఒకటి చొప్పున వెలుగులోకి వస్తున్నప్పటికీ.. పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు పకడ్బందీగా తీర్పు ఇస్తున్నప్పటికీ.. అంతిమంగా జనాలలో మాత్రం మార్పు రావడం లేదు. పైగా మరింత తీవ్ర స్థాయిలో ఘోరాలకు పాల్పడుతున్నారు. దారుణాలకు ఒడి కడుతున్నారు. అటువంటి దారుణం ఏపీలో జరిగింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వెలుగులోకి వచ్చింది.
కాకినాడ జిల్లాలోని తుని అనే ప్రాంతంలో నారాయణరావు అనేవృద్ధుడు ఇక్కడి గురుకుల పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి బాలికను బయటికి తీసుకొచ్చాడు. వాస్తవానికి పాఠశాలలో విద్యార్థులను బయటికి అంత సులభంగా పంపరు. కాకపోతే నారాయణరావు స్కూల్ యాజమాన్యం వద్దకు వెళ్లి.. ఏదో బలమైన కారణం చెప్పాడు. దీంతో ఆ బాలిక నారాయణరావు వెంట వచ్చింది. అతడు ఆమెకు మాయమాటలు చెప్పి హంసవరం సపోటా తోటల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై దారుణానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే సపోటా తోట యజమాని నారాయణరావు వెళ్తున్న తీరు చూసి అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే నారాయణరావును అనుసరించాడు.
నారాయణరావు సపోటా తోట యజమాని అలికిడిని గమనించలేదు. తోటలోకి తీసుకెళ్లిన తర్వాత ఆ బాలికకు మళ్ళీ మాయమాటలు చెప్పాడు. ఆమెను అసభ్యకరంగా తాకాడు. అంతేకాదు తను వేసుకున్న దుస్తులను తొలగించాలని సూచించాడు. అభం శుభం తెలియని ఆ బాలిక నారాయణరావు చెప్పినట్టు చేస్తున్న నేపథ్యంలో ఆకస్మాత్తుగా సపోటా తోట యజమాని ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మొత్తం వీడియో తీయడం మొదలుపెట్టాడు. దీంతో నారాయణరావు అతడిని ప్రతిఘటించాడు. అలా ఎందుకు వీడియో తీస్తున్నామని ప్రశ్నించాడు. దీంతో సపోటా తోట యజమాని గట్టిగా బెదిరించడంతో నారాయణరావు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ నేపథ్యంలో సపోటా తోట యజమాని ఆ బాలికను తీసుకొని పాఠశాల వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని చెప్పడంతో పాఠశాల యాజమాన్యం పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. బాలికతో ఫిర్యాదు చేసిన తర్వాత నారాయణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు సపోటా తోట యజమాని తీసిన వీడియోను ప్రధాన సాక్ష్యంగా వారు పరిగణించి.. నారాయణరావు మీద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.