Big Day For Indian Cricket: చరిత్రలో తేదీలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ కొన్ని తేదీలు మాత్రం గొప్పగా మిగిలిపోతాయి. అలాంటి తేదీ రానే వచ్చింది. విజయం సాధిస్తే చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. ఓటమి పాలైతే విమర్శలను మూటకట్టుకుంటారు. ఈసారి వచ్చిన తేదీ టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. పురుషుల జట్టుకు, ఇటు స్త్రీల జట్టుకు ఈ తేదీ అత్యంత ముఖ్యం.
ప్రస్తుతం టీమిండియా వేదికగా వరల్డ్ కప్ జరుగుతోంది. మనతో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ.. సింహభాగం మ్యాచ్ లు మన దేశం వేదికగానే జరుగుతున్నాయి. తొలి రెండు మ్యాచ్లలో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఏకంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ పరంపర కొనసాగించే విషయంలో టీమ్ ఇండియా దారుణంగా తరబడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఓటములను ఎదుర్కొంది. దీంతో టీమిండియా కు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో టీమ్ ఇండియాకు ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితి ఏర్పడింది. ప్లేయర్లు కీలక దశలో విఫలమవుతున్నారు. దీంతో టీమ్ ఇండియాకు ఓటములు తప్పలేదు. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో టీం ఇండియా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్లలో అంచనాలను అందుకున్న భారత్.. ఆ తదుపరి మూడు మ్యాచ్లలో ఓటమిపాలైంది. దీంతో రేపు (అక్టోబర్ 23) జరగబోయే మ్యాచ్ టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యమైనదిగా మారిపోయింది. న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్లో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తదుపరి బంగ్లాదేశ్ జట్టుతో జరిగే మ్యాచ్లో కూడా టీం ఇండియా ఇస్తే ఎటువంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీఫైనల్ వెళ్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తమ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి.
ఇక భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయింది. దారుణమైన బ్యాటింగ్.. అంతకంటే దరిద్రమైన బౌలింగ్ తో పరువు తీసుకుంది. తరచూ అవాంతరాలు కలిగించిన వర్షం కూడా టీమ్ ఇండియాను ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి మ్యాచ్ రేపు ఆడబోతోంది. అడిలైడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిస్తేనే సిరీస్ మీద ఆశలు ఉంటాయి. లేకపోతే ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా కు పరాభవం తప్పదు. ఇదే ఆస్ట్రేలియా గడ్డమీద టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయింది. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలంటే టీమిండియా కచ్చితంగా ఈ సిరీస్ నెగ్గాలి. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్ ల మీద అదరగొట్టాలి..
అటు మహిళల జట్టుకు, ఇటు పురుషుల జట్టుకు అక్టోబర్ 23 అనేది అత్యంత ముఖ్యమైనదిగా మారిపోయింది. ఈ రెండు జట్లకు రేపు జరగబోయే జీవన్మరణ సమస్యగా మారిపోయాయి. అందుకే రెండు జట్లు అద్భుతంగా ఆడి విజయాలు అందుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు.