https://oktelugu.com/

SBI: ఈ దొంగలు మామూలోళ్లు కాదు.. ఏకంగా జులాయి సినిమానే లైవ్ లో చూపించారు..

ఆధునాతన గ్యాస్ కట్టర్లు.. తాళాలు పగలగొట్టడానికి పెద్ద పెద్ద సుత్తెలు.. అలా బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు 10 కోట్ల వరకు బంగారాన్ని అపహరించారు.. లాకర్లను పగలగొట్టి బీభత్సం సృష్టించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 20, 2024 / 10:01 AM IST

    SBI(1)

    Follow us on

    SBI: చదువుతుంటే అల్లు అర్జున్ జులాయి సినిమా గుర్తుకు వస్తోంది కదూ. సేమ్ మక్కికి మక్కి అలానే చోరీకి పాల్పడ్డారు. ఏకంగా 10 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించారు. లాకర్లో దాచిన బంగారాన్ని బయటకి తీసి దర్జాగా దోచుకుపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటుచేసుకుంది. రాయపర్తిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు కార్యాలయం ఉంది. ఇది మెయిన రోడ్డు పక్కనే ఉంది. రాయపర్తి లో చాలామంది రైతులే ఉన్నారు. వీరంతా కూడా బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. కొంతమంది తమ బంగారాన్ని లాకర్లో భద్రపరిచారు. ఇలా ఖాతాదారులు భద్రపరచిన బంగారం విలువ దాదాపు పదికోట్ల వరకు ఉంటుంది. వాస్తవానికి లాకర్లలో బంగారం భద్రపరిచిన విషయం ఎక్కువగా సిబ్బందికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఎవరో చెప్పినట్టు.. దగ్గరుండి చూసినట్టుగా దొంగలు గ్యాస్ కట్టర్ల సహాయంతో బ్యాంకు కిటికీ గ్రిల్స్ తొలగించారు. నేరుగా లాకర్లలోకి వెళ్లిపోయారు. లాకర్లను బద్దలు కొట్టి పదికోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్ళారు. మొత్తం ఈ దొంగతనం జులాయి సినిమాలో చూపించినట్టుగానే ఉంది. పైగా దొంగలు దొంగతనం చేస్తున్న సమయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అయితే దొంగలు ఇంత బరితెగించినప్పటికీ ఆ సమయంలో అలారం ఎందుకు మోగలేదు అనేది అనుమానా స్పదంగా ఉంది.

    దొంగలకు ఎలా తెలిసింది

    సహజంగా బ్యాంకు లాకర్లలో పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది. పైగా వారి భద్రపరిచే లాకర్లు అత్యంత దుర్భేద్యంగా ఉంటాయి. అన్ని ఉన్నప్పటికీ దొంగలు ఆ లాకర్లను ఎలా బద్దలు కొట్టారనేది ఇక్కడ ప్రశ్నగా ఉంది. బ్యాంకులో పనిచేసే సిబ్బంది ఎవరైనా దొంగలకు సమాచారం అందించారా? వారు అందించిన సమాచారంతోనే దొంగలు బంగారాన్ని తస్కరించారా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాకర్లలో బంగారం చోరీకి గురికావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తమ బంగారాన్ని తమకు ఇచ్చేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే రాయపర్తి లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఏర్పాటు చేసిన ఇంతవరకు ఒక్క చోరీ కూడా జరగలేదు. అయితే ఈ ప్రాంతంలో పేరు మోసిన నేరగాళ్లు ఎవరైనా ఉన్నారా? దొంగతనం కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? అనే కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. అయితే ఈ వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బ్యాంకు ఉద్యోగుల ఫోన్ కాల్ డాటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాలలో ఇలా 10 కోట్ల విలువైన బంగారం తస్కరణకు గురి కాలేదు. ఇది పోలీసులనే కాకుండా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులను కూడా షాక్ కు గురిచేస్తోంది. అయితే పోలీసులు ఈ కేసులో సవాల్ గా తీసుకున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను బయట పెడతామని చెబుతున్నారు.