Khammam: బస్టాండ్ సమీపంలో వెంకటరమణ దంపతులు గతంలోనే భారీ భవంతిని నిర్మించారు. అయితే ఇటీవల ఆ ఇంట్లో కిరాయికి ఉండడానికి ముగ్గురు వచ్చారు. ఇల్లు మొత్తం చూసి నచ్చిందని చెప్పారు. కొంతమేర నగదు అడ్వాన్స్ కూడా ఇచ్చారు.. వెంకటరమణ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్లారు.. ఆ తర్వాత సోమవారం సాయంత్రం వెంకటరమణకు ఫోన్ చేశారు. తాము ఇంట్లో దిగడానికి వస్తున్నామని చెప్పారు. దానికి వెంకటరమణ కూడా ఒప్పుకున్నాడు. చెప్పినట్టు గానే వారు సోమవారం సాయంత్రం దాటిన తర్వాత వెంకటరమణ ఇంటికి వచ్చారు. రాత్రి కావడంతో భోజనం చేయండి అని వెంకటరమణ, అతడి సతీమణి చెప్పడంతో వాళ్లు అలాగే తిన్నారు. భోజనం చేసిన తర్వాత మాకు పక్కనున్న గ్రామంలో పని ఉందని వారు వెళ్లిపోయారు.. ఆ తర్వాత మంగళవారం ఫోన్ చేసి తమ ఇంట్లోకి వస్తున్నామని చెప్పారు. మంగళవారం కూడా రాత్రి సమయంలోనే వెంకటరమణ ఇంటికి ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత వెంకటరమణ ఉంటున్న వాటాలోకి వెళ్లారు. వెంకటరమణ దంపతుల కళ్ళల్లో కారం కొట్టి హత్య చేశారు. అంతేకాదు తాము హత్య చేసిన ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో కారం చల్లారు. మృతదేహాలను ఇంట్లోంచి ఇంటి బయట తాళం వేశారు.
ఇలా వెలుగులోకి
వెంకటరమణ దంపతులకు కుమార్తె అనురాధ జగ్గయ్యపేటలో ఉంటున్నది. బుధవారం ఉదయం ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ప్రతిరోజు ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటుంది. తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఎంతకీ ఎత్తలేదు. దీంతో అదే గ్రామంలో ఉంటున్న వెంకటరమణ సోదరుడు రమేష్ (అనురాధకు బాబాయ్) కు ఫోన్ చేసింది. అతడు వచ్చి తాళం పగలగొట్టగా ఇంట్లో వెంకటరమణ దంపతుల మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ఇంట్లో ఉన్న నగలు లేదా నగదును ఎత్తుకెళ్లినట్టు కనిపించలేదు.. అయితే పోలీసులు వాటిని పరీక్షించగా రోల్డ్ గోల్డ్ అని తేలింది. అయితే అవి రోల్డ్ గోల్డ్ అని తెలియకపోవడంతో దుండగులు వాటిని ముట్టుకోలేదని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు? దాని వెనుక వారి ఉద్దేశం ఏంటి? ఎవరైనా తెలిసిన వారు ఇలాంటి పనిచేయించారా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల హత్య నేలకొండపల్లిలో సంచలనం సృష్టించింది. అయితే ఇంతటి దారుణానికి దగ్గర వాళ్లే పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఆస్తి తగాదాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని వారు భావిస్తున్నారు.