Crime News : తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మలపల్లి కి చెందిన శివ, లక్ష్మీ దంపతులు. లక్ష్మి నిండు గర్భిణి. ఆమె ప్రసవం కోసం తన పుట్టిల్లు అయిన ఏపీ రాష్ట్రం నంద్యాల జిల్లా బలపాలపల్లి కి వెళ్ళింది. ఆమెకు నొప్పులు రావడంతో పుట్టింటి వారు సమీపంలో ఉన్న బేతం చర్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయితే ఆమెకు రక్తపోటు అధికంగా ఉండడంతో కర్నూలు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అంతకుముందు శివ మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గ మధ్యలో కుక్క అడ్డువచ్చింది. దీంతో వాహనం అదుపుతప్పింది. ఫలితంగా అతడు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రమైన గాయాల పాలయ్యాడు. దీంతో అతడిని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అటు భర్త, ఇటు భార్య..
అటు భార్యను, భర్తను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ప్రమాదంలో గాయపడిన శివ కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇక ప్రసవం కోసం వచ్చిన లక్ష్మి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. శివ మరణించిన గంట తర్వాత లక్ష్మి కుమారుడికి జన్మనివ్వడం విశేషం. అయితే పుట్టిన కుమారుడిని చూసేందుకు శివ ప్రాణాలతో లేకపోవడం కన్నీరు పెట్టిస్తోంది. లక్ష్మి కి శివ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అనే విషయం తెలియదు. ఓవైపు శివ చనిపోవడం.. మరోవైపు అతనికి కుమారుడు జన్మించడం.. ఈ విషయాన్ని లక్ష్మికి ఎలా చెప్పాలో తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర మానవేదనకు గురయ్యారు. ఇలాంటి బాధ పగవాడికి కూడా రావద్దని లక్ష్మీ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విషాదం నింపింది. శివ నడుపుతున్న వాహనం కుక్క అడ్డు రావడంతో బోల్తా పడిందని.. దీంతో శివ తీవ్రంగా గాయపడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో అతడి శరీరం నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగిందని.. అందువల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు అంటున్నారు. అంతర్గతంగా గాయాలు కావడం వల్ల అతడి ప్రాణాలు కాపాడడం సాధ్యం కాలేదని చెబుతున్నారు. ” అతడి తలకు తీవ్రంగా గాయమైంది. ఇతర అవయవాలు కూడా దెబ్బతిన్నాయి. అంతర్గతంగా రక్తస్రావం తీవ్రంగా జరిగింది. ఆ సమయంలో అతడికి మా శక్తికి మించి వైద్యాన్ని అందించాం. అయినప్పటికీ అతడి ప్రాణాలను కాపాడలేకపోయాం.. అతని భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాకపోతే తన కుమారుడిని చూసేందుకు అతడు జీవించలేడు. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దని” కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్నారు. కాగా, బుధవారం సాయంత్రం శివకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మి ఆస్పత్రి బెడ్ పై ఉండడంతో.. తన భర్త కడచూపు చూసుకునే అవకాశం కూడా ఆమెకు లభించలేదు.